మియాపూర్‌లో లారీ బీభత్సం: ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
మియాపూర్‌లో లారీ ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ సింహాచలం మృతి, ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు, డ్రైవర్ పరార్.;

హైదరాబాద్ మియాపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ ట్రాఫిక్ పోలీసు ప్రాణాన్ని బలిగొంది. సోమవారం రాత్రి మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లపై ఓ లారీ వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ సింహాచలం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. వికేందర్, రాజవర్ధన్ అనే మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, నో ఎంట్రీ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో కూకట్‌పల్లి వైపు నుంచి వచ్చిన లారీ యూటర్న్ వద్ద అదుపుతప్పి ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది. ఈ సమయంలో అంబ్రెల్లా వద్ద డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వీరిలో సింహాచలం పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటనాస్థలిలో నుండి పరారయ్యాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.