అర్థరాత్రి అమ్మాయి నుంచి వీడియో కాల్.. సీన్ కట్ చేస్తే
కాల్ మాట్లాడకపోయినా.. ఆ కాల్ లిఫ్ట్ చేయడమే అతని పాలిట శాపమైంది. దానిని రికార్డ్ చేసిన అవతలి వ్యక్తులు..
సాధారణంగా ఒక అమ్మాయి నుంచి మామూలు ఫోన్ కాల్ వస్తేనే గంటల తరబడి మాట్లాడుతుంటారు. మరి వీడియో కాల్ అంటే ఇంకేముంది.. సరిగ్గా ఇదే జరిగింది కర్నూల్ లో. ఓ యువకుడికి అర్థరాత్రి అమ్మాయి నుంచి వీడియో కాల్ వచ్చింది. సీన్ కట్ చేస్తే.. అది హనీ ట్రాప్ అని తెలిసి నన్ను కాపాడండి సార్ అంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఎమ్మిగనూరులో ఉంటోన్న సునీల్ కు రాత్రి సమయంలో ఓ నంబర్ నుండి వీడియో కాల్ వచ్చింది. ఎవరో అని కాల్ లిఫ్ట్ చేసిన యువకుడు ఒక్కసారిగా అవక్కాయ్యాడు. కాల్ ఎత్తగానే ఓ మహిళ తన డ్రెస్ తీసేస్తూ కాల్ మాట్లాడుతోంది. వెంటనే సునీల్ కాల్ కట్ చేశాడు.
కాల్ మాట్లాడకపోయినా.. ఆ కాల్ లిఫ్ట్ చేయడమే అతని పాలిట శాపమైంది. దానిని రికార్డ్ చేసిన అవతలి వ్యక్తులు.. సునీల్ ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా వీడియో క్రియేట్ చేసి సునీల్ కి సెండ్ చేశారు. అది చూసిన సునీల్ కి మైండ్ బ్లాంక్ అయింది. కొద్దిసేపటికి మరో మెసేజ్ వచ్చింది. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో, అతని స్నేహితులకు షేర్ చేసి పరువు తీస్తానని బెదిరించింది. తన వద్ద డబ్బులు లేవని, వీడియో ఎవరికీ పంపొద్దని వేడుకున్నప్పటికీ వారు వినలేదు. సునీల్‌కు చెందిన ఇద్దరు మిత్రులకు ఆ వీడియోను షేర్ చేశారు. దాంతో తన పరువు పోతుందని భయపడి ఏం చేయాలో అర్థం కాక తనలో తానే కుమిలిపోయాడు.
కాసేపటికి మరొక కాల్ వచ్చింది. మేము సీబీఐ అధికారులం మాట్లాడుతున్నాం. నీ వీడియో యూట్యూబ్‌లో వచ్చిందని, వెంటనే డబ్బులు ఇచ్చి దానిని డిలీట్ చేయించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. హనీట్రాప్ ముఠా వేధింపులు తట్టుకోలేక సునీల్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.