కట్నంలో మూడు గ్రాముల బంగారం తక్కువ.. చివరికి..!

3 గ్రాముల బంగారం తక్కువ ఇచ్చారని ఆమెకు టార్చర్ పెట్టారట..?

Update: 2022-08-13 08:26 GMT

కర్ణాటక: పెళ్లయిన మూడు నెలలకే ఓ గృహిణి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా మియాపూర్‌లో చోటుచేసుకుంది. రూపబాయి(22) అనే గృహిణి విషం సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రూపాబాయి మరణం ఖచ్చితంగా హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. భర్త కుటుంబీకులు కట్నం కోసం వేధిస్తూ వచ్చారని.. అదను చూసి ఆమెను హత్య చేశారని చెబుతున్నారు.

రూపబాయికి గంగాధర్ (32)తో మూడు నెలల క్రితం వివాహమైంది. రూపాబాయి తల్లిదండ్రులు కట్నం ఇచ్చి పెళ్లిని ఘనంగా జరిపించారు. కానీ గంగాధర్ తల్లిదండ్రులు మాత్రం 3 గ్రాముల బంగారం తక్కువ ఇచ్చారని రూపను వేధించేవారు. ఆమె నెలన్నర గర్భిణి అయినప్పటికీ భర్త కుటుంబీకులు నిత్యం వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కట్నం ఇవ్వలేదని రూపాబాయిపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేసి విషమిచ్చారని.. అంతే కాకుండా ఆస్పత్రిలో చేరిన 2 రోజుల తర్వాత గంగాధర్ విషయం చెప్పాడని రూపా తల్లిదండ్రులు వాపోయారు. విషం సేవించి తీవ్ర అస్వస్థతకు గురైన రూపాబాయి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట రూపా తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై సంతబెన్నూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఘనంగా పెళ్లి చేసి మూడు నెలలు అవ్వకుండానే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. రూప హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.


Tags:    

Similar News