ట్రాఫిక్ పోలీసుల టార్చర్.. మంటల్లో స్కూటర్‌

Update: 2023-06-20 17:46 GMT

ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేయమని ట్రాఫిక్ పోలీసుల వేధింపులపై ఆగ్రహంతో ఉన్న ఓ వ్యక్తి తన బైక్ ను తగులబెట్టాడు. శంషాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన స్కూటర్‌కు నిప్పంటించాడు. మహ్మద్ మసీయుద్దీన్ తన యాక్టివాపై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపి పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేయమని అడిగారు. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి లైటర్ తీసుకుని తన వాహనంలోని పెట్రోల్ ట్యాంక్‌లో లైటర్‌ను విసిరాడు. వెంటనే బైక్ కు మంటలు అంటుకున్నాయి. పోలీసులు వెంటనే మంటలను ఆర్పి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మసియుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనను వేధిస్తూ ఉండడం వలనే ఈ పనికి తెగబడ్డానని మసీయుద్దీన్ చెప్పుకొచ్చాడు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కామన్ చెరువు పక్కనే ఉన్న తన ఇంటి నుంచి తన స్కూటీపై ఇంప్లాంట్ స్కూల్ నుంచి తమ బాబును తీసుకురావడానికి వెళుతూ ఉన్నప్పుడు పోలీసులు అడ్డుకున్నారన్నాడు. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు స్కూటీని అడ్డగించి బలవంతంగా పక్కకు తీసుకెళ్లి స్కూటీ తాళాలు తీసుకున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టి స్కూటీ తీసుకెళ్లాలని బెదిరించారన్నాడు. గతంలో కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారని, స్కూల్ కి వెళ్లాలని ఎంత బతిమిలాడినా స్కూటీ ఇవ్వకపోవడంతో ఆవేశానికి లోనై స్కూటీ పెట్రోల్ ట్యాంకర్ లో నిప్పు పెట్టానని తెలిపాడు.

ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ చలాన్ల ఎంక్వయిరీ చేయడంతో ఆ స్కూటీపై 28 చలానాలు ఉన్నాయని మొత్తం 9 వేల రూపాయలు కట్టాల్సి ఉందన్నారు పోలీసులు. 9 వేలలో కొంతైనా డబ్బులు కట్టాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పడంతో స్కూటీ యజమాని ఆవేశానికి లోనై స్కూటీకి నిప్పు పెట్టుకున్నాడని తెలిపారు. అతనిని ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని ట్రాఫిక్ పెండింగ్ చలానాలు మాత్రమే కట్టండి అని అడగడం జరిగిందన్నారు.


Tags:    

Similar News