వీధిలో మహిళను వేధించి.. పారిపోయాడు
ఆ వ్యక్తి వెనుక నుండి ఇద్దరు మహిళలను టచ్ చేస్తూ వచ్చాడు;

బెంగళూరు నగరంలో ఒక మహిళపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు. కర్ణాటక రాజధానిలోని బిటిఎం లేఅవుట్ ప్రాంతంలో జరిగింది. సంఘటన జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలో రికార్డయిన వీడియో ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇరుకైన సందులో నడుస్తున్న ఇద్దరు మహిళల వద్దకు ఒక వ్యక్తి వస్తున్నట్లు కనిపిస్తోంది. రోడ్డుకు ఒక వైపున పలు ద్విచక్ర వాహనాలు నిలిచి ఉండగా వీధి నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి వెనుక నుండి ఇద్దరు మహిళలను టచ్ చేస్తూ వచ్చాడు, అతను ఆ మహిళల్లో ఒకరిని పట్టుకుని ఎదో చేయడానికి ప్రయత్నించగా వారిద్దరూ ప్రతిఘటించారు, దీంతో అతడు అక్కడి నుండి పారిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు బాధితురాలు స్వయంగా ముందుకు రాకపోతే, తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తులు జరుగుతున్నాయి.