ఉలిక్కిపడ్డ హైదరాబాద్.. కలకత్తా వాసిని కాల్చేశారు

హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మియాపూర్‌ పోలీస్ స్టేషన్

Update: 2023-08-24 02:52 GMT

హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవేందర్‌ గాయన్‌ అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. మదీనాగూడలో జరిగిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి మాదాపూర్‌ డీసీపీ సందీప్‌, మియాపూర్‌ పోలీసులు చేరుకున్నారు. దేవేందర్‌ కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్‌ జనరల్‌ మేనేజర్‌గా గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మృతుడు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన వ్యక్తి. దేవేందర్ హోటల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. దేవేందర్‌పై మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల కోసం కంట్రీ మేడ్ పిస్టల్‌ని ఉపయోగించారని పోలీసులు తెలిపారు. దేవేందర్ గత 6 నెలలుగా కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న గన్ కల్చర్ కు ఈ ఘటన ఒక ఉదాహరణ అని అంటున్నారు.


Tags:    

Similar News