దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, 18 రోజుల పాటు మెహ్రౌలీ అటవీ ప్రాంతం సమీపంలో నగరం అంతటా పారవేస్తూ వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అఫ్తాబ్ అమీన్ పూనావాలాగా గుర్తించారు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ప్రియురాలు శ్రద్ధను అతడు హత్య చేశాడు. నిందితుడు నేరం అంగీకరించడంతో పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదు నెలల క్రితం మే నెలలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ హత్య జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు నవంబర్ 8న మెహ్రౌలీ పోలీసులకు తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ముంబైలో మలాడ్ ప్రాంతంలోని కాల్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఆమెకు ఆఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ఈ జంట ఢిల్లీకి వెళ్లి సహజీవనం చేయడం ప్రారంభించారు. బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే తమ కుమార్తె లివ్-ఇన్ రిలేషన్‌షిప్ గురించి తెలుసుకుని వ్యతిరేకించారు. శ్రద్ధ మాత్రం అఫ్తాబ్ తనను వివాహం చేసుకుంటాడనే ఆలోచనలో ఉంది. పెళ్లి చేసుకుని కలిసి ఉందామని ఆఫ్తాబ్‌ను ఒత్తిడి చేస్తూ ఉండడంతో.. ఇద్దరి మధ్య తరచూ గొడవలకు దారితీసింది. గొడవ సమయంలో శ్రద్ధ బిగ్గరగా అరవడంతో.. ఆమెను నిశ్శబద్దంగా ఉంచడానికి గొంతును నొక్కాడు. దీంతో ఊపిరాడక శ్రద్ధ మృతి చెందింది.
అఫ్తాబ్ తాను చేసిన నేరాన్ని దాచడానికి, ఒక రంపాన్ని ఉపయోగించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, వాటిని 18 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారవేసాడు. ఆమె శరీర భాగాలను 18 రోజుల పాటు దుర్వాసన రాకుండా భద్రపరిచేందుకు పెద్ద ఫ్రిజ్‌ను కూడా కొనుగోలు చేశాడు. అఫ్తాబ్ ప్రతిరోజూ రాత్రి 2 గంటలకు అటవీ ప్రాంతంలో శరీర భాగాలను పారవేసేందుకు మెహ్రౌలీకి వెళ్లేవాడు. కొన్ని రోజులుగా శ్రద్ధ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయకపోవడంతో ఆమె కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఆమె తండ్రి ఐదు నెలల క్రితం ఢిల్లీకి వెళ్లి తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌తో కలిసి తన కూతురు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. అయితే, అక్కడికి చేరుకోగానే, ఆ స్థలం తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన ఆమె తండ్రి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు.