భార్య గవర్నమెంట్ ఉద్యోగంలో చేరుతోందని చేయి నరికేసిన భర్త

తన భార్య రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగంలో చేరకుండా అడ్డుకోడానికి

Update: 2022-06-06 13:54 GMT

అసూయ.. క్షణికావేశం లాంటి వాటి వలన ఎన్నో ఘోరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఓ భర్త భార్య ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా ఉండేందుకు ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌ కు చెందిన ఒక వ్యక్తి తన భార్య రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగంలో చేరకుండా అడ్డుకోడానికి ఆమె చేతిని నరికేశాడు. మణికట్టు భాగం నుండి ఆమెకు చేయి లేకుండా చేశాడు.

భర్త షేర్ మొహమ్మద్, తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని కేతుగ్రామ్ నివాసి. బాధితురాలు రేణు ఖాతున్. ఇంత దారుణమైన ఘటన తర్వాత సోమవారం ఉదయం తన భార్యను స్థానిక ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్ళాడు. వైద్యులు దానిని తిరిగి జోడించలేరని నిర్ధారించుకోవడానికే అతడు ఆసుపత్రికి వెళ్లాడని తెలుస్తోంది. తన నివాసంలో కత్తిరించిన శరీర భాగాన్ని దాచిపెట్టాడు. ఘటన తర్వాత షేర్ మహ్మద్ పరారీలో ఉన్నాడు. అతని కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు.
రేణు ఖాతున్ నర్సింగ్ శిక్షణ పొందుతోంది, సమీపంలోని ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.ఇటీవల, ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇది ఆమె భర్తకు కోపం తెప్పించింది. షేర్‌ మహ్మద్‌ నిరుద్యోగి కావడంతో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో భార్య తనను విడిచిపెడుతుందేమోనని భయపడ్డాడని స్థానికులు తెలిపారు. ఉద్యోగంలో చేరవద్దని షేర్‌ మహ్మద్‌ పట్టుబట్టడంతో ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే రేణు ఖాతున్ అందుకు అంగీకరించలేదు. చివరకు సోమవారం షేర్ మహ్మద్ ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.


Tags:    

Similar News