చపాతీ ఇవ్వనందుకు చంపేశాడు
ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు వెతకడం
చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ ఉంటారు. అలాంటిదే ఓ ఘటన ఇది. చపాతీ పంచుకోడానికి నిరాకరించినందుకు హత్య జరిగిన ఘటన ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. చపాతీ పంచేందుకు నిరాకరించినందుకు రిక్షా నడిపే వ్యక్తిని హత్య చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన వ్యక్తిని 40 ఏళ్ల మున్నాగా గుర్తించారు. నిందితుడు ఫిరోజ్ ఖాన్ ను కరోల్ బాగ్‌లోని ఒక పార్క్ నుండి అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు.
మంగళవారం, జూలై 26న.. ఒక వ్యక్తి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. స్థానికులు అతడిని ఆటోలో ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం కరోల్‌బాగ్ పోలీసు స్టేషన్ లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి 10 గంటల సమయంలో విష్ణు మందిర్ మార్గ్‌లో మున్నాతో కలిసి కూర్చున్నట్లు ప్రత్యక్ష సాక్షి లఖన్ పోలీసులకు తెలిపారు. మున్నా హోటల్ నుంచి తెచ్చిన ఆహారం తినడం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి ఆహారం అడగడంతో మున్నా చపాతీ ఇచ్చాడు.
నిందితుడు మరో చపాతీ కావాలని కోరగా మున్నా అందుకు నిరాకరించాడు. "నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. చపాతీ ఇవ్వనందుకు అతను అరవడం, తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కోపంతో పొడవాటి పదునైన కత్తిని తీసుకొచ్చి మున్నాను పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రత్యక్ష సాక్షి అతనిని 400-500 మీటర్ల వరకు వెంబడించాడు కానీ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. మున్నాను ఆటో రిక్షాలో RML ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించాడు, "అని పోలీసులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. రోడ్డు పక్కన, పార్క్ ప్రాంతంలో అనుమానితుడు ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ విక్రమ్‌సింగ్, ఏఎస్‌ఐ జితేందర్‌తో కూడిన బృందం జజోరియా పార్కుకు చేరుకుని పార్కులో నిద్రిస్తున్న అనుమానితుడిని గుర్తించారు. ఆ తర్వాత చంపింది ఫిరోజ్ ఖాన్ అని గుర్తించారు. విచారణలో నిందితుడు తాను చేసిన నేరం ఒప్పుకున్నాడు. ఘటనా స్థలం నుంచి సీసీటీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.