బాంబులు కాల్చొద్దన్నాడని యువకుడిని పొడిచి చంపిన మైనర్లు
ఇద్దరు గొడవపడుతుండటాన్ని చూసిన బాలుడి అన్న (15), అతని స్నేహితుడు (14) అక్కడికి వచ్చారు. ముగ్గురూ కలసి..
ఈ దీపావళి కొందరికి సంతోషాన్నిస్తే.. మరికొందరికి మాత్రం విషాదాన్ని మిగిల్చింది. దీపావళి రోజున పటాసులు పేల్చడం సాధారణం. కానీ.. దానివల్ల పొల్యూషన్ పెరుగుతుందని అందరికీ తెలిసినా.. ఏడాదికి ఓసారి వచ్చే పండుగ కదా. ఈ రోజుకి బాంబులు కాల్చితే ఏమీ కాదన్న భావనతో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ.. కొందరు ఆకతాయిలు అవే బాంబుల్ని గాజు సీసాల్లో పెట్టి పేల్చుతుంటారు. వాటి వల్ల చాలామందికి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ముంబై లో కొందరు బాలురు ఇలా చేస్తుండగా..ఓ యువకుడు అలా పేల్చడం ప్రమాదకరమని వారించాడు. అంతే.. అతడిని కత్తితో పొడిచి చంపేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శివాజీనగర్ కు చెందిన 12 ఏళ్ల బాలుడు గ్లాసు బాటిల్ లో టపాసులు ఉంచి పేలుస్తున్నాడు. అది గమనించిన పొరుగింటి యువకుడు సునీల్ శంకర్ నాయుడు (21) వద్దని వారించాడు. అది చాలా ప్రమాదమని, గ్లాస్ పేలి దాని ముక్కలు అందరికీ గుచ్చుకుంటాయని చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది.
ఇద్దరు గొడవపడుతుండటాన్ని చూసిన బాలుడి అన్న (15), అతని స్నేహితుడు (14) అక్కడికి వచ్చారు. ముగ్గురూ కలసి శంకర్ తో గొడవపడ్డారు. గొడ్డవ పెద్దదయ్యేసరికి ముగ్గురు బాలురు శంకర్ పై దాడి చేశారు. బాలుడి అన్న శంకర్ పొట్టలో కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాలుడి అన్న, అతని స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు కారణమైన బాలుడు పరారీలో ఉండగా.. అతనికోసం గాలిస్తున్నారు.