ట్రోలింగ్ తట్టుకోలేక మరొకరు బలి... ఒక తల్లి బలవన్మరణం
చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ తట్టుకోలేక ఒక తల్లి బలవన్మరణానికి పాల్పడింది
చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ తట్టుకోలేక ఒక తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్ లో గోడ అంచు చివరకు చిన్నారి చేరుకుంది. ఆ చిన్నారిని కాపాడటానికి సమీపంలోని వారు అనేక ప్రయత్నాలు చేశారు. కింద పడితే గాయాలపాలు కాకుండా ఉండేందుకు దుప్పట్లు ఉంచారు. అలాగే మరొక వ్యక్తి గోడమీదకు ఎక్కి ఆ చిన్నారిని చివరకు ప్రాణాలతో రక్షించగలిగారు. కథ సుఖాంతమయింది.
ఫెయిల్యూర్ మదర్ అంటూ...
అయితే చిన్నారిని పూర్తిగా వదిలేసిందని తల్లిపై సోషల్ మీడియాలో కొందరు పోస్టింగ్ లు పెట్టారు. ట్రోలింగ్ చేశారు. నిందించారు. స్థానిక మీడియా కూడా ఫెయిల్యూర్ మదర్ అంటూ అనేక కథనాలు నిరంతరం ప్రసారంచేయడంతో ఆ చిన్నారి తల్లి తట్టుకోలేకపోయింది. దీంతో ఆ చిన్నారి తల్లి రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో చేసిన ట్రోలింగ్ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.