బీటెక్ స్టూడెంట్ జీవన్ ఆత్మహత్యకు ముందు ఇన్ స్టా లో పోస్ట్.. వెటకారం చేసిన ఫ్రెండ్

మనస్తాపానికి గురైన జీవన్ సోమవారం ఇంటి నుండి వెళ్లిపోయి స్నేహితుడి ఇంట్లో పడుకున్నాడు. మంగళవారం తిరిగి ఇంటికెళ్లాడు.

Update: 2023-05-11 07:09 GMT

b tech student jeevan

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామం పరిధిలో బుధవారం (మే 10) ఉదయం గుర్తించలేని స్థితిలో మూడొంతులు కాలిపోయి ఉన్న మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. మృతదేహం కాలిపోయి ఉండటంతో తొలుత హత్యకేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత ఆత్మహత్య అయి ఉండవచ్చని భావించారు. మృతుడు జమ్ములమూడి జీవన్ (21) గా గుర్తించారు. పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.

జీవన్ తల్లిదండ్రులు నాగమణి, సుధాకర్ తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో ఉండేవారు. కొంతకాలం క్రితమే విజయవాడ నగరానికి వచ్చి క్రీస్తురాజపురంలో ఉంటున్నారు. జీవన్ తో పాటు కుమార్తె కూడా ఉంది. ఆమెకు పెళ్లైంది. తండ్రి సుధాకర్ ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ లోన్ తాలూకా ఈఎంఐ కట్టమని జీవన్ కు రూ.12 వేలు ఇచ్చాడు. జీవన్ ఆ డబ్బును తన అవసరాలకు ఖర్చు చేశాడు. ఈ విషయం తెలిసిన తండ్రి రెండ్రోజుల క్రితం జీవన్ ను మందలించాడు.
మనస్తాపానికి గురైన జీవన్ సోమవారం ఇంటి నుండి వెళ్లిపోయి స్నేహితుడి ఇంట్లో పడుకున్నాడు. మంగళవారం తిరిగి ఇంటికెళ్లాడు. ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉందని తల్లికి చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత తన ఇన్ స్టా ఖాతాలో బహుశా నాకు ఇదే చివరిరోజు కావచ్చని పోస్టు పెట్టాడు. అది చూసిన స్నేహితుడు వెటకారంగా పోస్టు పెట్టగా..జీవన్.. సర్లే ఈ రోజు రాత్రికి తెలుస్తుందిలే అని మెసేజ్ చేశాడు. జీవన్ ఫ్రెండ్ శ్యామ్ బర్త్ డే సందర్భంగా గురునానక్ కాలనీలోని ఓ హోటల్ లో జరిగిన పార్టీకి హాజరయ్యాడు.
మంగళవారం రాత్రి 9 గంటలకు తల్లి నాగమణి ఫోన్ చేయగా.. పార్టీ అయ్యాక 11 గంటలకు ఇంటికి వస్తానని చెప్పాడు. పార్టీ అయ్యాక అక్కడే నిద్రపోయిన జీవన్.. అర్థరాత్రి 12.30 గంటలకు తన స్నేహితుడిని లేపి బైక్ తాళాలు తీసుకుని బయటికి వచ్చాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో యనమలకుదురులో పెట్రోల్ బంక్ కు వెళ్లి.. ఓ బాటిల్ లో రూ.100 పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం తల్లిదండ్రులతో మాట్లాడిన జీవన్.. నాన్నను జాగ్రత్తగా చూసుకో అని తల్లికి చెప్పి ఇన్నాళ్లు నన్ను భరించినందుకు కృతజ్ఞతలు అమ్మా అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత జీవన్ కు మూడుసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. పెదపులిపాక వెళ్లి అక్కడ ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణం చెందాడు జీవన్. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోధిస్తోంది. జీవన్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు.. అతని ఊపిరితిత్తుల్లోకి పెట్రోల్ వెళ్లినట్లు గుర్తించారు. తొలుత హత్యగా భావించిన పోలీసులు.. ఇప్పుడు ఆత్మహత్య అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.









Tags:    

Similar News