ఈ రాజుగారి వల్ల పని జరగదట.. పక్కకు తప్పించేస్తారా?

బీజేపీలో కీల‌క నేత‌గా ఉన్న మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు.. త‌న కుమారుడు రంగ‌రాజును వైసీపీలోకి పంపించిన విష‌యం తెలిసిందే. వెళ్లీ వెళ్లడంతోనే ఆయ‌న‌కు వైసీపీ అధినేత [more]

Update: 2021-01-20 08:00 GMT

బీజేపీలో కీల‌క నేత‌గా ఉన్న మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు.. త‌న కుమారుడు రంగ‌రాజును వైసీపీలోకి పంపించిన విష‌యం తెలిసిందే. వెళ్లీ వెళ్లడంతోనే ఆయ‌న‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా మంచి ఛాన్స్ ఇచ్చారు. పార్టీలో ఉండి.. పార్టీ త‌ర‌ఫున గెలిచిన న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌రాజు అస‌మ్మతి నాయ‌కుడిగా మారిపోయి.. తీవ్రస్థాయిలో విమ‌ర్శలు చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు చెక్ పెట్టేలా.. ర‌ఘు సామాజిక వ‌ర్గానికే చెందిన రంగ‌రాజుకు న‌ర‌సాపురం పార్లమెంటు ఇంచార్జ్ ప‌ద‌విని క‌ట్టబెట్టారు. ఫ‌లితంగా ఆయ‌న దూకుడు చూపించి.. ర‌ఘురామ‌రాజుకు చెక్ పెడ‌తార‌ని భావించారు. అంతేకాదు, న‌ర‌సాపురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలోని నేత‌ల‌కు కూడా రంగ‌రాజు ఎలా చెబితే అలా వినాల‌నే ఆదేశాలు కూడా పంపించారు.

బలంగా ఉన్న టీడీపీ……

దీనిని బ‌ట్టి రంగ‌రాజు దూకుడు ప్రద‌ర్శిస్తార‌ని, పార్టీని ముందుకు న‌డిపిస్తున్నార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే పార్టీలో చేరి దాదాపు 9 నెల‌లు గ‌డిచినా రంగ‌రాజు ఎక్కడా దూకుడు చూపించ‌లేక‌పోతున్నార‌నేది తాజా స‌మాచారం. అంతేకాదు.. పార్టీలో నేత‌ల‌కు కూడా ఆయ‌న అంటీ ముట్టన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌. అత్యంత కీల‌క‌మైన న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ బ‌లంగా ఉంది. పైగా జ‌న‌సేన‌కు కూడా ఇక్కడ గ‌ట్టి ప‌ట్టుంది. వైసీపీ ఈ ఎంపీ సీటును కేవ‌లం 26 వేల ఓట్ల తేడాతోనే గెలుచుకుంది. పైగా గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన నాగ‌బాబు మూడో ప్లేస్‌లో నిలిచినా 2.50 ల‌క్షల ఓట్లు సాధించారు.

అందరికీ పరిచయమే అయినా…?

ఇక ఈ పార్లమెంటు ప‌రిధిలోనే టీడీపీ ఉండి, పాల‌కొల్లు సీట్లు భారీ మెజార్టీతో గెలుచుకుంది. అలాంటి చోట వైసీపీని మ‌రింత‌గా బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది పార్టీ సీనియ‌ర్ల మాట‌. దీనిని దృష్టిలో పెట్టుకునే అటు ఆర్థికంగా, ఇటు రాజ‌కీయంగా కూడా బ‌లంగా ఉన్న రంగ‌రాజుకు అవ‌కాశం ఇచ్చారు. కానీ, రంగ‌రాజు మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించ‌డ‌మే లేదు. పార్టీ నేత‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం లేదు. స్థానిక స‌మ‌స్యల‌పై ప‌ట్టు సాధించ‌లేక పోతున్నార‌ట‌. పోనీ.. ఇదేమ‌న్నా రంగ‌రాజుకు కొత్త నియోజ‌క‌వ‌ర్గమా? అంటే.. కాదు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో గోక‌రాజు గంగ‌రాజు బీజేపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ప్రతి ఒక్కరికీ రంగ‌రాజు ప‌రిచ‌య‌మే.

వైసీపీ అధ్యయనంలో….

అయిన‌ప్పటికీ.. ఆయ‌న ఎక్కడా దూకుడు చూపించ‌లేక పోతున్నార‌నేది తాజాగా వైసీపీ చేసిన అధ్యయ‌నంలో తేలింది. చివ‌ర‌కు ఆయ‌న ప‌నితీరుపై అటు అధిష్టాన‌మే కాదు స్థానికంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏ మాత్రం సంతృప్తిక‌రంగా లేరు. అస‌లు ఆయ‌న ఎవ్వరిని క‌లుపుకుని వెళ‌దామ‌న్న ఆలోచ‌న‌లోనే లేర‌ట‌. దీంతో ఇక్కడ ఇంచార్జ్ బాధ్యత‌ల నుంచి రంగరాజును త‌ప్పిస్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది. అయితే.. ఎవ‌రికి ప‌గ్గాలు ఇవ్వాల‌నే విష‌యంలో మాత్రం పార్టీలో క్లారిటీ లేదు. క్షత్రియ సామాజిక వ‌ర్గంతోపాటు కాపులు కూడా బ‌లంగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ మ‌ళ్లీ గెలుపు గుర్రం ఎక్కాలంటే.. స‌రైన నాయ‌కుడి అవ‌స‌రం ఉంద‌ని… రంగ‌రాజు వ‌ల్ల ప‌నిజ‌ర‌గ‌ద‌ని సీనియ‌ర్లు సైతం అభిప్రాయ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News