అజిత్ కు అందలం అందదా?

అజిత్ పవార్…. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేత. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుటుంబ సభ్యుడు. అయితే తొలుత బీజేపీతో కలిపి చేతులు కాల్చుకుని తిరిగి [more]

Update: 2019-12-19 16:30 GMT

అజిత్ పవార్…. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేత. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుటుంబ సభ్యుడు. అయితే తొలుత బీజేపీతో కలిపి చేతులు కాల్చుకుని తిరిగి సొంత గూటికి చేరుకున్న అజిత్ పవార్ కు ముఖ్యమైన పదవి దక్కుతుందా? అన్న చర్చ మొదలయింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమితో ప్రభుత్వం ఏర్పాటయింది. ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మాత్రమే మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన పదిహేను రోజుల తర్వాత వారికి శాఖలు కేటాయించారు.

మంత్రి వర్గ విస్తరణకు….

త్వరలోనే మరోసారి మంత్రి వర్గ విస్తరణకు కూటమి రెడీ అయిందంటున్నారు. ఈ నెల 23వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అజిత్ పవార్ విషయం చర్చనీయాంశమైంది. దేవేంద్ర ఫడ్నవిస్ తో చేతులు కలిపి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే అజిత్ పవార్ సొంత పార్టీ ఎన్సీపీలోకి వచ్చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీలోకి వచ్చే ముందే శరద్ పవార్ తో అజిత్ కు ఒప్పందం కుదిరిందంటున్నారు.

డిప్యూటీ సీఎంగా….

తిరిగి పార్టీలోకి వస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని శరద్ పవార్ హామీ ఇవ్వడంతోనే అజిత్ తిరిగి వచ్చారంటున్నారు. దీంతో పాటుగా అజిత్ పవార్ కు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు ఎన్సీపీలో అధికంగా ఉండటంతో శరద్ పవార్ కూడా అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించారు. అయితే మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల అనంతరం శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలె తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపు వెళ్లకుండా సుప్రియా సూలె కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు.

సుప్రియ అభ్యతరం…?

ఈ నేపథ్యంలో అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు పార్టీ ఎమ్మెల్యేల్లోకి వెళతాయని సుప్రియా సూలె భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవితో సరిపెట్టాలని, డిప్యూటీ సీఎం పదవి మాత్రం వద్దని ఆమె తండ్రి శరద్ పవార్ కు ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. అయితే అజిత్ పవార్ మాత్రం తనకు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం కావాలని కోరుతున్నారు. ఇప్పటికైతే శరద్ పవార్ అజిత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News