Ambati : అంబటిని అక్కడకు షిఫ్ట్ చేస్తారా?

వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం వైసీీపీకి కీలకమే. అందుకే అనేక మార్పులు చేర్పులు వచ్చే ఎన్నికల్లో ఉండబోతున్నాయంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కోల్పోయిన స్థానాలపై ప్రధానంగా దృష్టి [more]

Update: 2021-11-06 08:00 GMT

వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం వైసీీపీకి కీలకమే. అందుకే అనేక మార్పులు చేర్పులు వచ్చే ఎన్నికల్లో ఉండబోతున్నాయంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కోల్పోయిన స్థానాలపై ప్రధానంగా దృష్టి పెట్టారంటున్నారు. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో ఈసారి సీనియర్ నేతను పోటీకి దింపాలన్న యోచనలో ఉన్నారు. రేపల్లెలో వైసీపీ ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. మోపిదేవి వెంకటరమణ 2014, 2019 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు.

హ్యాట్రిక్ కోసం….

ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా అనగాని సత్యప్రసాద్ రెండు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ విజయం కోసం శ్రమిస్తున్నారు. అయితే మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ కు వెళ్లిపోయారు. ఎన్నికలు జరిగే నాటికి ఇంకా నాలుగేళ్ల పాటు మోపిదేవి వెంకటరమణకు పదవీ కాలం ఉండటంతో ఆయనను మళ్లీ ఇక్కడ పోటీ చేయించే అవకాశం లేదు. అందుకే సీనియర్ నేత అంబటి రాంబాబును రేపల్లె నుంచి పోటీ చేయిస్తారన్న టాక్ వినపడుతుంది.

సత్తెనపల్లిలో….

1989లో అంబటి రాంబాబు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు కొంత వ్యతిరేకత కనపడుతుంది. టీడీపీలో గ్రూపులు అనేకం ఉన్నా ఎన్నికల నాటికి సర్దుకుంటే అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికలలో విజయం అంత సులువు కాదు. అందుకే అంబటి రాంబాబును రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేయించడంపై కసరత్తులు జరుగుతున్నాయని సమాచారం.

ఆయనను తీసుకు వచ్చి….

సత్తెనపల్లిలో అంబటి రాంబాబు స్థానంలో ఎవరికి టిక్కెట్ వచ్చే అవకాశాలున్నదానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ‍యర్రం వెంకటేశ్వర్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఆయన గత ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ జనసేనలో యాక్టివ్ గా లేరు. ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా చంద్రబాబు నుంచి టిక్కెట్ హామీ లభించలేదని తెలిసింది. దీంతో యర్రంను అంబటి రాంబాబు స్థానంలో దించాలన్నది కూడా వైసీపీ వ్యూహంగా కన్పిస్తుంది. యర్రం సత్తెనపల్లి నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.

Tags:    

Similar News