జగన్ మనస్తత్వం అలాంటిది...!

Update: 2018-09-22 01:30 GMT

అన్నా బ‌త్తుని శివ‌కుమార్‌. గుంటూరు జిల్లా తెనాలి రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌స్థాయిగా వినిపించేదే..! దివంగ‌త మాజీ మంత్రి అన్నాబ‌త్తుని స‌త్యనారాయ‌ణ కుమారుడిగా శివ‌కుమార్‌.. రాజ‌కీయ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. 1983, 1985 ఎన్నిక‌ల్లో అన్నాబ‌త్తుని స‌త్య‌నారాయ‌ణ టీడీపీ త‌ర‌ఫు తెనాలి అభ్య‌ర్థిగా పోటీ చేసి రెండు సార్లు విజ‌యం సాధించారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. అంతేకాదు, విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేయ‌డంలోనూ... అంకిత భావానికి పెద్ద పేరుగా ఆయ‌న నిలిచారు. ఆయ‌న వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్న అన్నాబ‌త్తుని శివ‌కుమార్ రాజ‌కీయాల్లో ఓవెలుగు వెల‌గాల‌ని భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున తెనాలి అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్‌పై ఓట‌మి చెందారు. అయితే.. ప‌డ్డ‌వాడు ఎప్పుడూ చెడ్డ‌వాడు కాద‌న్న‌ట్టుగా ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి తీరాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌ను జ‌ల్లెడ ప‌డుతున్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్ర‌స్తుతం తెనాలి వైసీపీ నియోజ‌వ‌క‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉన్న అన్నాబ‌త్తునికి క‌లిసి వ‌స్తున్న అంశాలు ఏమిటి? ఏవిధంగా విజ‌యానికి ఆయ‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు ? వ‌ంటి కీల‌క‌మైన అంశాలపై ‘‘తెలుగు పోస్ట్’’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

ప్రశ్న : మీ తండ్రి వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో మీ ఓటమికి కారణాలేంటి ?

శివ‌కుమార్ : తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పునాది ఎవ‌రో... ఇక్క‌డ పార్టీ ప‌టిష్ట‌త కోసం అన్నాబత్తుని ఫ్యామిలి ఎంత కష్టపడిందో ఎంత బలమైన పునాది వేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీలో మేం పడిన కష్టానికి సరైన గుర్తింపు లేకే ఆ రోజు బయటకు రావాల్సి వచ్చింది. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆహ్వానంతో, ఆయ‌న పిలుపు మేర‌కు వైసీపీలో చేరాం. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తా. గ‌త ఎన్నిక‌ల్లో అనేక కార‌ణాల వ‌ల్ల చివ‌రి క్ష‌ణంలో పార్టీ టిక్కెట్ ఖ‌రార‌వ్వ‌డం కూడా నా ఓట‌మికి ఓ ప్ర‌ధాన కార‌ణం.

ప్రశ్న : మీతండ్రి అంచ‌నాలు అందుకోలేద‌న్న టాక్ ఉంది ? దీనికి మీరు చెప్పే స‌మాధానం ?

శివ‌కుమార్ : నా తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ గారు తెనాలి మున్సిపల్ చైర్మ‌న్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తెనాలి ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఆయన రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నేను క‌నీసం ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌కుండానే ఆయన రేంజ్‌, ఇమేజ్‌ ఇప్పటికిప్పుడు అందుకోవాలంటే సాధ్యం కాదు. రాజకీయాల్లో సుధీర్ఘ‌కాలంలో నా తండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ఆయనలాగా మంచి పేరు తెచ్చుకుంటానన్న విశ్వాసం నాకు ఉంది.

ప్రశ్న : గ‌త ఎన్నిక‌ల్లో మీరు దాదాపు 19 వేల ఓట్ల తేడాతో ఓడారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలా పుంజుకోవాల‌ని భావిస్తున్నారు?

శివ‌కుమార్ : తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో మనం చూస్తూనే ఉన్నాం. తెనాలిలో స్థానిక ఎమ్మెల్యే అవినీతి తారా స్థాయికి చేరుకుంది. క‌బ్జాల‌కు అంతే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై ఎంత సానుకూల సంకేతాలు ఉన్నాయో ఈ రోజు జనాల్లో ప్రభుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌... జ‌నాల్లో ఉన్న ప్ర‌జాగ్ర‌హ‌మే చెపుతోంది. ఇక నా వ్యక్తిగత ప్రొఫైల్‌, మచ్చలేని రాజకీయ జీవితం, నా విద్యాసంస్థల ద్వారా వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించ‌డం నా గెలుపుకు కారణం అవుతున్నాయి.

ప్రశ్న : గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో మీరు గుర్తించిన ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ?

శివ‌కుమార్ : తెనాలి నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాతాల్లో పంటలకు సక్రమంగా నీరందక‌ వేల ఎకరాలు ఎండి పోతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దీని మీద ఏనాడు దృష్టి పెట్టలేదు. ఆయనకు హడావిడే తప్ప సాధారణ రైతులకు ఆయన వల్ల వొరిగిందేమి లేదు. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా స‌మ‌స్య‌లే ఉన్నాయి.

ప్రశ్న : రాజ‌ధాని ప్రాంత‌మే అయినా... అభివృద్ధి క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు... దీనిని ఎలా చూస్తారు ?

శివ‌కుమార్ : చంద్రబాబు రాజధాని అంటూ గాలిలో మేడలు కడుతున్నారే తప్ప నిజంగా రాజధాని నిర్మాణం ఎక్కడ జరిగింది ? అసలు రాజధానే లేదు. రాజధాని అభివృద్ధి జరిగివుంటే సమీపంలో ఉన్న తెనాలి అభివృద్ధి గురించి మాట్లాడుకోవచ్చు. రాజధాని అనౌన్స్‌మెంట్‌ అయ్యాక అంతకు ముందు తెనాలిలో ఉన్న భూముల రేట్లు కూడా ఇప్పుడు లేవు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే తెనాలికి ఎంతో క్రేజ్‌ ఉండేది, తెనాలి అభివృద్ధి బాగుండేది. అయితే చంద్రబాబు గాల్లో మేడలు క‌డుతూ.... మాటలు కోటలు దాటించ‌డంతో అటు రాజధాని నిర్మాణమే లేదు. రాజధాని పేపర్ల మీదే స‌రిగా లేదు. ఇక నాలుగేళ్ల‌లో తెనాలి అభివృద్ధి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. ఈ నాలుగేళ్లలో తెనాలికి ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందేమో చెప్పండి.

ప్రశ్న : అధికార పార్టీ నేతల దౌర్జ‌న్యం పెరిగింద‌ని, భూక‌బ్జాలు పెచ్చ‌రిల్లాయ‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీటికి మీ దగ్గర ఆధారాలున్నాయా?

శివ‌కుమార్ : తెనాలి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. టైమ్‌ వచ్చినప్పుడు వీటిని పూర్తిస్థాయిలో బయట పెట్టడం జరుగుతుంది.

ప్రశ్న : తెనాలిలో ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఏమిటి? వాటిని మీరు ఎలా ప‌రిష్క‌రించాల‌ని భావిస్తున్నారు?

శివ‌కుమార్ : నియోజ‌క‌వ‌ర్గంలో చాలా స‌మ‌స్య‌లే ఉన్నాయి. 2014 త‌ర్వాత స్థానిక ఎమ్మెల్యే ప‌రిష్క‌రించినవి ఏం లేవు. ఇక్కడ ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తోనే ఉన్నాను. రైతుల‌కు నీరు అంద‌క‌పోవ‌డం... ప‌ట్ట‌ణ స‌మ‌స్య‌లు కీల‌కం.

ప్రశ్న : జగన్ వ్య‌వ‌హార శైలిపై సొంత పార్టీ నుంచి ఫిరాయించిన నేత‌లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.. దీనిని మీరెలా చూస్తారు ?

శివ‌కుమార్‌: రాజకీయాల్లో సొంత పార్టీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లాక జన్మను ఇచ్చిన వారిపై బురద చల్లడం సహజం. అంతెందుకు టీడీపీలో మోత్కుపల్లి నర్సింహులు గారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. ఇటీవల ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినప్పుడు చంద్రబాబుపై ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారో తెలిసిందే. జగన్మోహ‌న్‌ రెడ్డి చంద్రబాబు లాంటి వ్యక్తి కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు... ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను నమ్మిన వారికి... త‌న‌ను న‌మ్ముకున్న వారికి ఏదోలా న్యాయం చేసే మనస్థత్వం ఆయనది.

ప్రశ్న : ప్ర‌స్తుతం వైసీపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను బాయ్ కాట్ చేసింది. ఇది క‌రెక్టేనా ?

శివ‌కుమార్‌: గత్యంతరం లేని పరిస్థితుల్లోనే... ప్రజాస్వామ్యంలో విలువలకు టీడీపీకి పాతర వేస్తున్న క్రమంలోనే వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. చివ‌ర‌కు రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న స్పీకర్ స‌హా పసుపు కండువా వేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ప‌రిహ‌సిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు గొంత్తెత్తేందుకు అవకాశం లేదు. మాట్లాడనివ్వడం లేదు. మహాత్మ గాంధీ సైతం భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని యుద్ధంతో తేలేదు. దీక్ష రూపంలో తెచ్చారు. నిరసన గొప్పది, గాంధీ మౌనంతో స్వాతంత్య్రం సాధించలేదా. ఇప్పుడు వైసీపీ కూడా అదే పంధాలో ప్రజాక్షేత్రంలో ప్రజాసమస్యలపై పోరాటం చేసి టీడీపీని గద్ది దించనుంది.

ప్రశ్న : ఫిరాయింపుల‌పై మీ అభిప్రాయం ఏంటి? గ‌తంలో మీ నాన్న‌గారు టీడీపీ.. ఇప్పుడు మీరు వైసీపీ క‌దా ? దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి ?

శివ‌కుమార్‌: న‌మ్ముకున్న చోట‌... న‌మ్ముకున్న వారు న‌ట్టేట ముంచితే పార్టీ మార‌డంలో త‌ప్పులేదు... అవ‌కాశం వాదం... స్వార్థంతో పార్టీ మార‌డ‌మే త‌ప్పు.

ప్రశ్న : వైసీపీలో చాలా మార్పులు... స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు షాకులు త‌గులుతున్నాయి... మీకు టిక్కెట్ వ‌స్తుంద‌న్న గ్యారెంటీ ఉందా ?

శివ‌కుమార్‌: నూటికి నూరు శాతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్.. తెనాలిలో గెలుపు నాదే. ఏదో కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల వ‌ల్ల ఒక‌రిద్ద‌రికి సీటు ఇవ్వ‌నంత మాత్రాన అంద‌రికి అన్యాయం జ‌ర‌గ‌దు. సీట్లు ఇవ్వ‌ని వారికి కూడా జ‌గ‌న్ మ‌రోలా న్యాయం చేస్తారు.

Similar News