అశోక్ టీం చెల్లాచెదురు.. బొత్స వ్యూహం ఫలించిందా ?
ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. పోనీ..రాజకీయ నేతలు భావిస్తున్నట్టు జమిలి ఎన్నికలు రావాలన్నా.. మరికొన్నాళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు తాను నిలబడాలి.. తన పార్టీని [more]
ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. పోనీ..రాజకీయ నేతలు భావిస్తున్నట్టు జమిలి ఎన్నికలు రావాలన్నా.. మరికొన్నాళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు తాను నిలబడాలి.. తన పార్టీని [more]
ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. పోనీ..రాజకీయ నేతలు భావిస్తున్నట్టు జమిలి ఎన్నికలు రావాలన్నా.. మరికొన్నాళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు తాను నిలబడాలి.. తన పార్టీని నిలబెట్టాలి. ఇదీ ఇప్పుడు విజయనగరం జిల్లా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ముందున్న కీలక టార్గెట్. టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి మాదిరిగా తయారైందని అంటున్నారు పరిశీలకులు. జిల్లాలో టీడీపీ తరఫునే కాకుండా అశోక్‌కు బలమైన కోటరీ నాయకుల అండ ఉండేది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జిల్లాలో టీడీపీకి ఆఫీసే లేకుండా తన కోటనే పార్టీ ఆఫీస్‌గా మార్చుకుని రాజకీయం చేయడం అశోక్ గజపతి రాజు స్టయిల్. అయితే.. ఇటీవల కాలంలో వారు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు.
అశోక్ ను వ్యతిరేకిస్తూ…..
ముఖ్యంగా పడాల అరుణ త్వరలోనే పార్టీ మారుతున్న విషయం తెలిసిందే. ఆమె అశోక్ గజపతి రాజుతో పడకపోవడం వల్లే పార్టీ మారిపోతున్నారని టాక్ ? అశోక్ వల్లే ఆమె టీడీపీలో రాజకీయంగా ఎదగలేకపోయారని టీడీపీ వర్గాలే చెపుతాయి. ఇక, మీసాల గీతకు అశోక్‌కు మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. ఆమె అశోక్ గజపతి రాజును తీవ్రంగా వ్యతిరేకిస్తూ విజయనగరంలోనే ఓ కొత్త ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. ఇక కోళ్ల లలిత కుమారి(శృంగవరపు కోట), కేఏ నాయుడు(గజపతి నగరం), కిమిడి నాగార్జున (చీపురుపల్లి) – ఈయనకు పార్లమెంటు పరిధిలో శ్రీకాకుళం ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సుజయ కృష్ణరంగారావు (బొబ్బిలి), జనార్దన్ థాట్రాజ్(కురుపాం), బొబ్బిలి చిరంజీవులు (పార్వతీపురం), భంజ్‌దేవ్(సాలూరు), కిశోర్ చంద్రదేవ్.. ఇలా చాలా మంది నాయకులు గత ఎన్నికల్లో పోటీ చేశారు. వీరంతా అశోక్ గజపతి రాజు కూటమిగా చంద్రబాబు దగ్గర మార్కులు సంపాయించుకున్నారు. అయితే.. ఎన్నికలు ముగిసిన ఏడాదిన్నరలోనే వీరంతా చెల్లా చెదురయ్యారు. ఎవరెవరు ఇప్పుడు ఏం చేస్తున్నారో. కూడా స్థానికంగా సైతం వారు సోదిలో లేకుండా పోవడం గమనార్హం.
సామాజికవర్గాల వారీగా….
జిల్లాలో మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు సామాజిక వర్గాల పరంగా తమ వర్గం నేతలను అశోక్ గజపతి రాజు కు వ్యతిరేకంగా ఎంకరేజ్ చేశారు. ఇక గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కేఏ. నాయుడు అశోక్‌ను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూప్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో రెండు సీట్లతో సరిపెట్టుకున్న వైసీపీ గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ మొత్తం గుండుగుత్తుగా క్లీన్ స్వీప్ చేసేసింది.
ఒక్కొక్కరినీ దూరం చేసి…..
అప్పటి నుంచి పార్టీకి బలమైన నాయకుడిగా ఉన్న అశోక్ గజపతి రాజు ను టార్గెట్ చేయడం ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన దూకుడుతో ముందుకు సాగారు. అశోక్ ఫ్యామిలీకే చెందిన సంచయితను రంగంలోకి తీసుకు రావడంతో అశోక్‌ను ఇంటా బయటా కూడా ఇరుకున పెట్టడంలో బొత్స సక్సెస్ అయిన పరిస్థితి. టీడీపీలో కొందరు అశోక్‌కు వ్యతిరేకంగా పావులు కదపడం వెనక కూడా వైసీపీ వాళ్లు ఉన్నారన్న సందేహాలు కూడా స్థానికంగా ఉన్నాయి. ఫలితంగా ఇప్పుడు అశోక్ టీం ఏది? అంటే చెప్పుకోడానికి కూడా ఎవరూ కనిపించని పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత దిగజారుతుందేమో..! అనే సందేహాలు తమ్ముళ్లను వేధిస్తుండడం గమనార్మం.