రాజావారిని దూరం పెడుతున్నారా ?

విజయనగరం రాజులు అంటేనే ప్రజలకు గౌరవ మర్యాదలు చాలా ఎక్కువ. విశాఖ విజయనగరం ప్రాంతాలను ఒకనాడు దశాబ్దాల పాటు ఏలిన వారు పూసపాటి వంశీకులు. ఇక విజయనగరంలో [more]

Update: 2020-10-05 08:00 GMT

విజయనగరం రాజులు అంటేనే ప్రజలకు గౌరవ మర్యాదలు చాలా ఎక్కువ. విశాఖ విజయనగరం ప్రాంతాలను ఒకనాడు దశాబ్దాల పాటు ఏలిన వారు పూసపాటి వంశీకులు. ఇక విజయనగరంలో అణువణువూ వారిదే. చాలా ఉదారంగా ప్రజల కోసం, ప్రజోపయోగమైన కార్యక్రమాలకు తమ భూములను దారాదత్తం చేశారు. ఇక పూసపాటి వంశానికి ఆధునిక తరం వారధి పీవీజీ రాజు అయితే రాజకీయాల్లొ ఆయన కుమారులు ఆనంద్, అశోక్ గజపతిరాజు వారసులుగా ఉంటూ వచ్చారు. అలా సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని గడిపిన అశోక్ కి ఇపుడు గడ్డుకాలమే నడుస్తోంది అని చెప్పాలి. ఆయన గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఇపుడు తన వారసురాలుగా కుమార్తెను కూడా చూసుకోలేక దిగాలు అవుతున్నారు.

బాబు దెబ్బ ……

చంద్రబాబుకు ప్రియ నేస్తంగా టీడీపీలో అశోక్ గజపతిరాజు ఉండేవారు. ఎన్టీయార్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం నెరపిన అశోక్ ని ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా ప్రచారం చేశారు కూడా. పార్టీలో అంతటి పట్టు ఉన్న అశోక్ ఎన్టీయార్ని కూలదోసి బాబుని సీఎం చేయడంతో తన శక్తియుక్తులన్నీ పూర్తిగా ఉపయోగించారు. దానికి ఆయన పూర్తి స్థాయిలో ప్రతిఫలం పొందారా అంటే లేదనే జవాబు వస్తుంది. అశోక్ గజపతిరాజు ని 2004 నుంచి ఒక క్రమ పద్ధతి ప్రకారం తగ్గిస్తూ వస్తున్న చంద్రబాబు 2014లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నా కూడా కేంద్రంలో ఒక సాధారణ ఎంపీగానే ఆయన ఉండాలని పోటీ చేయించారు. అయితే మోడీ దయతో కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు నాలుగేళ్ల కాలం పనిచేశారు.

చెక్ చెప్పేశారా…?

ఇక 2019 ఎన్నికల్లో తండ్రీ కూతుళ్ళు అయిన అశోక్ గజపతిరాజు, అతిధి గజపతి రాజు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లతో ఓడిపోయారు. దాంతో బాబు వారిని పూర్తిగా సైడ్ చేశారని అంటున్నారు. ఈ పరాభవం తట్టుకోలేక అశోక్ తాను క్రియాశీల రాజకీయాల నుంచి పక్కకు జరిగి తన కుమార్తె అతిధిని మాత్రం యాక్టివ్ చేస్తూ వచ్చారు. ఇక బాబు రాజకీయ జీవిత వైభవానికి ఎంతో చేసిన అశోక్ విజయనగరం పార్లమెంట్ ప్రెసిడెంట్ గా తన కుమార్తెను నియమించాలని నోరు విడిచి అడిగారని చెబుతున్నారు. కానీ బాబు దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కళా వెంకటరావు తమ్ముడు కొడుక్కు పదవి ఇచ్చారు. దాంతో రాజా వారు రగిలిపోతున్నారని టాక్.

అది గుర్తొచ్చిందా….?

నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో తరిస్తున్న అశోక్ కులం ఏంటి అన్నది చూడకుండా ఓట్లు వేయడం జనాలకు అలవాటు, ఎక్కడైనా బీసీ, ఓసీలు ఉంటాయి కానీ విజయనగరంలో మాత్రం రాజు గారే తమ నాయకుడు అని ప్రజలు డిసైడ్ అయి ఎన్నో మార్లు గెలిపిస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం బలంగా వీచింది. ఏకంగా లోకేష్ కూడా ఓడిపోయాడు. అయితే అశోక్ గజపతిరాజు కి ప్రజాదరణ లేదని టీడీపీ హైకమాండ్ నిర్ధారణకు రావడమే కాకుండా ఆయన ఓసీ కులాన్ని కోరి గుర్తుచేసుకుంటోందిట. అందుకే బీసీలకే పదవులు అంటూ కొత్త సాకులు చెప్పి అశోక్ గజపతిరాజు కుమర్తెను రేసులో తప్పించారని అంటున్నారు. ఒంటిచేత్తో విజయనగరం జిల్లాలో పార్టీని అశోక్ నడిపించేవారని, అయితే అక్కడ ఇంచార్జి మంత్రిగా గంటా శ్రీనివాస్ లాంటి వారిని దింపి, బొబ్బిలి రాజులను పార్టీలోకి తెచ్చి పార్టీలో వర్గాలు పెంచింది చంద్రబాబేనని అశోక్ వర్గం అంటోంది. మొత్తానికి ఇపుడు బాబుకు అశోక్ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అయిపోయినట్లుగా ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా అధినాయకత్వం మీద ఆగ్రహంతో ఉన్న అశోక్ గజపతిరాజు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News