సీఎం ఎవరో ఇప్పుడే తేల్చరట

ఈశాన్య భారతానికి గుండెకాయ వంటి అసోం ముఖ్యమంత్రి ఎంపికపై భారతీయ జనతా పార్టీ గుంభనంగా వ్యవహరిస్తోంది. ఇటు రాష్ర్టంలో, అటు కేంద్రంలో చక్రం తిప్పుతున్న కమలం పార్టీ [more]

Update: 2021-04-23 16:30 GMT

ఈశాన్య భారతానికి గుండెకాయ వంటి అసోం ముఖ్యమంత్రి ఎంపికపై భారతీయ జనతా పార్టీ గుంభనంగా వ్యవహరిస్తోంది. ఇటు రాష్ర్టంలో, అటు కేంద్రంలో చక్రం తిప్పుతున్న కమలం పార్టీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చలేదు. మూడు దశల్లొ ఎన్నికలు ముగిసిన ఇక్కడి ఎన్నికల ఫలితాలు మే 2న వెల్లడి కానున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్, ప్రభుత్వంలో కీలక శాఖలను నిభాయిస్తున్న హిమంత బిశ్వ శర్మ ఈ పదవికి పోటీపడుతున్నారు. సోనావాల్ ఆది నుంచి కమలం పార్టీలో ఎదగగా, శర్మ 2016లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ కండువా కప్పుకున్నారు. సోనావాల్ మజులి నియోజకవర్గం నుంచి పోటీచేయగా, శర్మ జలుకాబరి స్థానం నుంచి బరిలోకి దిగారు.

లాబీయింగ్ చేసినా?

సహజంగా అధికారంలో ఉన్న రాష్ర్టంలో ఎన్నికలు జరిగినప్పుడు సిట్టింగ్ ముఖ్యమంత్రే మళ్లీ సీఎం అవుతారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప సిట్టింగ్ సీఎంను మార్చరు. ఈ మేరకు ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే అనధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలిసిపోతుంది. కానీ కమలం పార్టీ ఈసారి అసోం విషయంలో మౌనం దాల్చింది. సీఎం అభ్యర్థి ఎవరన్న విషయమై ఇప్పుడు చర్చ అనవసరమన్న పార్టీ రాష్ర్టవ్యవహారాల పరిశీలకుడు బీఎల్ సంతోష్ ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోపక్క సీఎం అభ్యర్థిని ప్రధానిమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయిస్తారని, లాబీ యింగ్ అన్నఅంశానికి పార్టీలో చోటు లేదని శర్మ అంటున్నారు. పైకి మాత్రం అసలు తాను సీఎం రేసులో లేనేలేనని చెబుతున్నారు. ప్రజాసేవకు, పార్టీ బలోపేతానికి ప్రయత్నించడమే తన కర్తవ్యమని స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలా మాట్లాడమంటే పరోక్షంగా తాను సీఎం పదవికి పోటీపడుతు న్నట్లు చెప్పకనే చెప్పినట్లు అవుతుంది.

పార్టీ బలోపేతం కోసం….

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2015లో కాంగ్రెస్ నుంచి కమలం పార్టీలో చేరిన శర్మ అనతికాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆర్థిక, ఆరోగ్య, ప్రణాళిక, విద్య, పటట్ణాభివద్ధి, పీడబ్యూడీ వంటి కీలక శాఖలకు సారథిగా ఉన్నారు. 2016లోనే ఆయన సీఎం పదవికి పోటీపడ్డారు. ఢిల్లీ ఆదేశాల మేరకు కొంత వెనక్కు తగ్గారు. కీలకశాఖలను ఇచ్చి సర్దిపుచ్చారు. అంతేకాక ఈశాన్య రాష్ర్ట ప్రజాస్వామ్య కూటమి (నెడా- నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్) కి కన్వీనర్ గా ఆయనను నియమించింది. ఈ హోదాలో ఈశాన్య భారతంలోని చాలా రాష్ర్టలు కమలం ఖాతాలోకి రావడానికి విశేష కృషి చేశారు. పార్టీ విస్తరణకు పాటుపడ్డారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ ప్రాంతంలో పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకోవడానికి తనదైన ప్రయత్నం చేసి విజయవంతయ్యారు. ఒక్క అసోంలోనే కాక యావత్ ఈశాన్య భారతంలో పార్టీని నిలబెట్టడానికి పాటుపడిన తనకు సీఎం పదవి ఇవ్వాలన్నది శర్మ కోరిక. ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు.

కాంగ్రెస్ తరహాలోనే?

ముఖ్యమంత్రిని గువహతీలో కాకుండా ఢిల్లీలో మోదీ,షా నిర్ణయిస్తారని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఇలాంటి రాజకీయాలను చూశాం. ఇప్పుడు కమలం పార్టీలో కనపడుతోంది. సహజంగానే ఈ పరిణామాలు ముఖ్యమంత్రి సోనావాల్ కు మింగుడు పడటం లేదు. అలాగని ఎక్కడా బహిరంగంగా మాట్లాడ లేదు. పరిస్థితులను ఓ కంట నిశితంగా పరిశీలిస్తున్నారు. సిట్టింగ్ సీఎంను మార్చదనే ధీమాను పార్టీలోని తన అనుచరుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. తనదైన వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అయితే హైకమాండ్ ఆలోచనపై అనుమానాలు లేకపోలేదు. అధిష్టానం ఆశీస్సులు లేకుండానే శర్మ అంత బహిరంగంగా మాట్లాడరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మోదీ, షా అనుమతి లేకుండానే పార్టీ రాష్ర్ట పరిశీలకుడు బీఎల్ సంతోష్ కూడా ముఖ్యమంత్రి పీఠం గురించి మాట్లాడరని చెబుతున్నారు. మొత్తానికి కమలం దిల్లీ నాయకత్వం హిమంత బిశ్వ శర్మ పట్ల సానుకూలంగానే ఉందన్న వాస్తవాన్ని తోసిపుచ్చలేం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News