వివాదంలో మ‌రో వైసీపీ ఎంపీ.. ఎక్కడ‌? ఏం జ‌రిగింది..?

ఇప్పటికే న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వైఖ‌రితో త‌ల‌బొప్పి క‌డుతున్న అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు మ‌రో ఎంపీ వివాదం రేపుతున్నారు. సీఎం జ‌గ‌న్ ఆశీస్సుల‌తో పార్టీలోకి వ‌చ్చాన‌ని [more]

Update: 2020-06-25 00:30 GMT

ఇప్పటికే న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వైఖ‌రితో త‌ల‌బొప్పి క‌డుతున్న అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు మ‌రో ఎంపీ వివాదం రేపుతున్నారు. సీఎం జ‌గ‌న్ ఆశీస్సుల‌తో పార్టీలోకి వ‌చ్చాన‌ని చెప్పుకొనే ఆయ‌న ఇటీవ‌ల విమ‌ర్శలు సంధిస్తున్నారు. అయితే, ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు రేంజ్‌లో ఇవి లేక‌పోవ‌డంతో పెద్దగా మీడియా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ, పార్టీ అధినేత, సీఎం జ‌గ‌న్ మాత్రం స‌ద‌రు ఎంపీ వైఖ‌రిపై నివేదిక‌కు తాజాగా ఆదేశాలు జారీ చేయ‌డంతో విష‌యం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా తిరుప‌తి ఎస్సీ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన బ‌ల్లి దుర్గా ప్రసాద ‌రావు.. ఈ వివాదంలో ముందున్నార‌నేది వైసీపీ నేత‌ల అభిప్రాయం.

టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి…

టీడీపీ నాయ‌కుడిగా రాజ‌కీయాల్లోకి అతి పిన్నవ‌య‌సులో వ‌చ్చిన బ‌ల్లి దుర్గాప్రసాద‌రావు.. ఆ పార్టీలో హార్డ్ కోర్ నాయ‌కుడిగా ఎదిగారు. చంద్రబాబుకు ఆయ‌న విద్యార్థి ద‌శ నుంచే స‌న్నిహితుడ‌న్న టాక్ ఉంది. గూడూరు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1985, 1994, 1999, 2009లోనూ టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. రాష్ట్రంలో అతి పిన్న వ‌య‌సులో అంటే కేవ‌లం 28 ఏళ్ల వ‌య‌సులోనే ఎమ్మెల్యే అయిన నాయ‌కుడిగా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. చంద్రబాబుకు చిన్నప్పటి స్నేహితుడు కావ‌డంతో ఆయ‌న‌తో అత్యంత సాన్నిహిత్యం ఉన్న నాయ‌కుడిగా బ‌ల్లి దుర్గాప్రసాద‌రావుకు పేరుంది.

వైసీపీ ఎంపీగా గెలిచిన తర్వాత….

2009లో పార్టీ ప్రతిప‌క్షానికి ప‌రిమితం అయిన‌ప్పుడు కూడా ఆయ‌న గూడూరులో ఎమ్మెల్యేగా బ‌ల్లి దుర్గాప్రసాద‌రావు గెల‌వ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేశారు. అలాంటి దుర్గా ప్రసాద్‌కు చంద్రబాబు పార్టీ గెలిచిన టైంలో 2014 ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వలేదు. అయితే, త‌ర్వాత ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తిరుప‌తి ఎంపీగా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసి వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌ర్వాత ఆయ‌న స్థానిక నేత‌ల‌ను ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శలు వ‌చ్చాయి. దీనిపై కొన్ని సంద‌ర్భాల్లో బ‌ల్లి దుర్గాప్రసాద‌రావు వివ‌ర‌ణ కూడా ఇచ్చుకున్నారు.

ప్రొటోకాల్ విషయంలో….

ఇక‌, ఇప్పుడు తాజాగా త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్రొటోకాల్ ప్రకారం కూడా త‌న‌కు గౌర‌వం ద‌క్కడం లేద‌ని బ‌ల్లి దుర్గాప్రసాద‌రావు ఆరోపిస్తున్నారు. తిరుప‌తి స్మార్ట్ సిటీ ప‌నుల్లో భాగంగా స్థానిక వినాయక్‌సాగర్‌ ఆధునికీకరణకు ఇటీవ‌ల‌ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఆయ‌న పేరును బల్లి దుర్గాప్రసాద్ బ‌దులు బి. దుర్గాప్రసాద్‌గా రాశారు. శిలాఫలకంలో అందరి ఇంటి పేర్లు వివరంగా రాసి.. తన ఇంటి పేరును ఇలా రాయడంపై ఎంపీ ఆగ్రహించారు. దీనివెనుక కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ఇక తిరుప‌తి నగరంలో నిర్మిస్తున్న గరుడ వారధి నిర్మాణం కేంద్రం ఇచ్చే స్మార్ట్‌ సిటీ నిధులతోనే జరుగుతోందని, రాష్ట్రం రూపాయి కూడా ఇవ్వడం లేద‌ని బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద మైన‌స్‌గా మారాయి.

ఇన్ ఛార్జి మంత్రిని ఆదేశించిన…..

అదే స‌మ‌యంలో ఈ ప్రాజెక్టు భూమిపూజకు కూడా తనను పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు.. క‌రోనా విష‌యంలో ప్రభుత్వం అవ‌లంబిస్తున్న చ‌ర్యలు త‌న‌కు న‌చ్చలేద‌ని కూడా బ‌ల్లి దుర్గాప్రసాద‌రావు విమ‌ర్శలు గుప్పించారు. ఇవ‌న్నీ జ‌రిగి నాలుగు రోజులు గ‌డిచాయి. అయితే, ఈ విష‌యంలో పార్టీ నేత‌లు ఉన్నార‌న్న ఆయ‌న ఆరోప‌ణ‌లు స‌హా తాజాగా న‌ర‌సాపురం ఎంపీ వివాదం నేప‌థ్యంలో జ‌గ‌న్ బ‌ల్లి దుర్గా ప్రసాద్‌రావు వ్యవ‌హారంపై కూడా దృష్టి పెట్టార‌ని, అస‌లు అక్కడ ఏం జ‌రుగుతోందో త‌న‌కు చెప్పాల‌ని ఇంచార్జ్ మంత్రిని ఆదేశించిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News