చిరంజీవికే షాక్ ఇచ్చిన ఫైర్‌బ్రాండ్ వైసీపీలోకా ?

బంగారు ఉషారాణి. 2009 ఎన్నిక‌ల్లో నాటి ఉమ్మడి రాష్ట్ర రాజ‌కీయాల్లో ఒక సంచ‌ల‌నం సృష్టించిన నాయ‌కురాలు. అప్పటి వ‌ర‌కు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ని కాంగ్రెస్ నేత అయిన [more]

Update: 2021-04-16 06:30 GMT

బంగారు ఉషారాణి. 2009 ఎన్నిక‌ల్లో నాటి ఉమ్మడి రాష్ట్ర రాజ‌కీయాల్లో ఒక సంచ‌ల‌నం సృష్టించిన నాయ‌కురాలు. అప్పటి వ‌ర‌కు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ని కాంగ్రెస్ నేత అయిన ఉషారాణి.. ఆ ఎన్నిక‌ల్లో మాత్రం ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం చేసి.. ఏకంగా ప్ర‌జారాజ్యం వ్య‌వ‌స్థాప‌కుడు, మెగాస్టార్ చిరంజీవిపై పోటీ చేసి.. పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అంత‌కు ముందే ఆమె పాల‌కొల్లు మునిసిప‌ల్ చైర్మన్‌గా ప‌నిచేశారు. వైశ్య సామాజిక వర్గంలో ఆమె ఫైర్‌బ్రాండ్ నాయ‌కురాలుగా గుర్తింపు పొందారు. వాస్తవానికి అప్పట్లో చిరంజీవిపై పోటీ చేసేందుకు నాయ‌కులు వెన‌క్కి త‌గ్గారు.. అయితే. ఉషారాణి మాత్రం ముందుకు వ‌చ్చి.. తాను పోటీ చేస్తాన‌ని చెప్పడంతో పాటు.. నాడు వైఎస్ ముందు స‌వాల్ చేసి మ‌రీ చిరంజీవిని ఓడించారు.

మెగా స్టార్ సొంత గడ్డ మీదే….?

పాల‌కొల్లు నియోజ‌క వ‌ర్గంలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌ను కాద‌ని మ‌రీ ఉషారాణి టిక్కెట్ తెచ్చుకుని చిరంజీవిని సొంత గ‌డ్డమీదే ఓడించారు. మ‌రో సంచ‌ల‌నం ఏంటంటే.. స్థానికంగా బ‌లంగా ఉన్న శెట్టి బ‌లిజ‌, కాపుల‌ను కూడా కాద‌ని.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చి అంద‌రూ ముక్కున వేలేసుకునేలా చేశారు. వైఎస్ అకాల మ‌ర‌ణంతో త‌ర్వాత రోశ‌య్య సీఎం అయిన త‌ర్వాత మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పిస్తార‌ని అనుకున్నారు. కానీ… రాలేదు. రోశ‌య్య వైశ్య సామాజిక వ‌ర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉషారాణి హ‌వా కొన‌సాగింది.

మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు…

అనంత‌రం కిర‌ణ్ కుమార్ స‌ర్కారులోనూ మంత్రివ‌ర్గంలో మార్పులు జ‌రిగిన‌ప్పుడు ఆమెకు మ‌ళ్లీ అవ‌కాశం వ‌స్తుంద‌ని అనుకున్నారు.కానీ.. అప్పుడు కూడా రాలేదు. ఇక‌, అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నప్ప‌టికీ.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో సైలెంట్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఆమెకు వైసీపీ నుంచి ఆహ్వానాలు అందినా సైలెంట్ అయ్యారు. మ‌ళ్లీ ఉషారాణి రాజ‌కీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాద‌ర‌ణ‌లేని కాంగ్రెస్‌లో ఉండే క‌న్నా.. వైసీపీలోకి వెళ్లడం ద్వారా త‌న ఫ్యూచ‌ర్ బాగుంటుంద‌ని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అందుకే లేటవుతుందట…

వైసీపీ చెంత చేరేందుకు ఆమె ప్రయ‌త్నాలు కూడా ప్రారంభించార‌ని స‌మాచారం. ప్రస్తుతం వైసీపీలో వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు త‌క్కువగా ఉన్నారు. పైగా ఈ వ‌ర్గంలో మ‌హిళా నేత‌ల‌కు పార్టీలో లోటు ఉంది. అందుకే ఆమె త‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీకి ఇదే స‌రైన స‌మ‌యం అని భావిస్తున్నార‌ట‌. అయితే ఊరికే పార్టీలో చేర‌డం కంటే.. ఏదైనా హామీతో పార్టీ మారితే కాస్త గుర్తింపు ఉంటుంద‌న్న ఆలోచ‌న ఉండ‌డంతోనే ఉషారాణి వైసీపీ ఎంట్రీ లేట్ అవుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News