వారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట

మొన్నటి ఎన్నికల్లో ఏదో ఊహించి ప్రధాన రాజకీయ పక్షాలను వదులుకుని మరీ జనసేన లో చేరారు కొందరు నేతలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన అవతరిస్తుందని [more]

Update: 2020-01-17 03:30 GMT

మొన్నటి ఎన్నికల్లో ఏదో ఊహించి ప్రధాన రాజకీయ పక్షాలను వదులుకుని మరీ జనసేన లో చేరారు కొందరు నేతలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన అవతరిస్తుందని కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైసిపి లనుంచి కూడా కొందరు జంప్ చేసి జై పవన్ కళ్యాణ్ అనేశారు. అయితే ఎన్నికలు దగ్గరపడేటప్పటికీ కొందరు పోలింగ్ ముందు మరికొందరు ఫలితాలు వచ్చాకా ఇంకొందరు పవన్ కళ్యాణ్ తీరును జనసేన పార్టీని విమర్శిస్తూ సొంత గుటిలోకి వెళ్లిపోయారు. సాక్షాత్తూ అధినేతే ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో పార్టీ భవిష్యత్తు సైతం అంధకారమే అని భావించే వీరంతా దూరం జరిగారన్నది తేల్చేశారు. అయితే ఇప్పుడు బిజెపి – జనసేన పొత్తు పొడవటం ఇలా వెళ్ళిన వారికి షాక్ ఇస్తుంది.

ఇక్కడికొచ్చినా ….

బిజెపి లో నుంచి జనసేనకు వెళ్ళి తిరిగి వచ్చినవారు కొందరు, మరికొందరు కాంగ్రెస్ కి మనుగడ లేదని భావించి టిడిపి, వైసిపి, జనసేన లపై విముఖతతో కాషాయంలో చేరారు. వీరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోనే నడవాలిసిన పరిస్థితి ఎదురుకావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. జనసేన తమతో కలవడం వల్ల 2024 లో తాము ఆశించిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎర్త్ పెడుతుందేమో అన్న ఆందోళన ఇప్పటినుంచి వారిలో వ్యక్తం అవుతుంది. వచ్చే ఎన్నికల నాటికి వైసిపి ప్రస్తుత చరిష్మా తగ్గి కమలానికి క్షేత్ర స్థాయిలో గట్టి పట్టు సాధించవచ్చని ఇప్పటినుంచి బూత్ స్థాయి కమిటీలతో కొందరు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే వీరికి స్థానిక జనసేన నేతలు పోటీ కి వచ్చే పరిస్థితి ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్న అభద్రత మొదలైంది.

వారి ఫోకస్ దానిపైనే …

వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాదిన కమలానికి తగ్గే సీట్లను దక్షిణాదిలో అధిక స్థానాలు సాధించడం ద్వారా భర్తీ చేసుకోవాలన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పటినుంచి నియోజకవర్గ జిల్లా స్థాయి కమిటీలను రద్దు చేసి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కమిటీలను ఏర్పాటు చేస్తుంది బిజెపి. అసెంబ్లీ స్థానాలు తమకు పెద్దగా ప్రాధాన్యం లేదన్న తీరులో ముందునుంచి పార్లమెంట్ సీట్లపైనే కన్నేసింది కమలం. ఎంపీ సీట్ల పరంగా జనసేన తో ఎలాంటి ఇబ్బందులు రావని తేలిపోతున్నా అసెంబ్లీ సీట్ల విషయంలో జనసేన అత్యధిక స్థానాలు తీసుకోవడం ఖాయమని అప్పుడు తమ భవిష్యత్తు ఇరకాటంలో పడినట్లే అన్నది ప్రస్తుతం బిజెపి లోకి ఇతర పార్టీలనుంచి వచ్చి సీట్లపై గురిపెట్టిన వారి ఆందోళన. ఈ సమస్య ఇప్పటిది కాకపోయినా ఖర్చు భరించే పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న చర్చలు వారిలో మొదలైపోయాయి అంటున్నారు.

Tags:    

Similar News