భీమిలీ టీడీపీలో ముసలం… ?

అదేంటో విశాఖ జిల్లా భీమిలీ టీడీపీని ముసలం పట్టుకుని చాలా ఏళ్ళే అయింది. కానీ దాన్ని సరిగ్గా చక్కదిద్దే ప్రయత్నం మాత్రం అధినాయకత్వం అసలు చేయడంలేదు అంటున్నారు. [more]

Update: 2021-08-14 05:00 GMT

అదేంటో విశాఖ జిల్లా భీమిలీ టీడీపీని ముసలం పట్టుకుని చాలా ఏళ్ళే అయింది. కానీ దాన్ని సరిగ్గా చక్కదిద్దే ప్రయత్నం మాత్రం అధినాయకత్వం అసలు చేయడంలేదు అంటున్నారు. కాస్తా వెనక్కి వెళ్తే కేవలం భీమిలీలో పోటీ విషయంలో వచ్చిన తేడా వల్లనే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరిపోయారు. ఆయన రావడంటో విశాఖ టీడీపీకి గట్టి దెబ్బ పడగా వైసీపీ ఆ క్రమలో బలపడింది. ఇక గంటా శ్రీనివాసరావుకు కూడా భీమిలీ సీటు ఇవ్వకుండా చివరి నిముషంలో ఆయన్ని విశాఖ నార్త్ కి పంపడం కూడా భీమిలీతో పాటు సిటీలో చాలా చోట్ల పార్టీ ఓడిపోవడానికి కారణం అయింది.

మళ్ళీ అదే సీన్ …?

ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎంపీ సబ్బం హరి ఈ మధ్యనే దివంగతులయ్యారు. దాంతో భీమిలీలో వర్గ పోరు కట్టలు తెంచుకుంది. హరి పెద్ద మనిషి కాబట్టి ద్వితీయ శ్రేణి నాయకులు లోలోపల దాచుకున్న అసంతృప్తి ఇపుడు బయట పెట్టేసుకుంటున్నారు. భీమిలీ నుంచి పోటీకి ప్రతీ నాయకుడూ ఇపుడు తయారుగా ఉన్నారు. దాంతో ఎవరినీ సముదాయించలేక పార్టీ జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు. అలా ఈ మధ్యనే పార్టీ మీద అలిగిన సీనియర్ నేత పాశర్ల ప్రసాద్ ని బుజ్జగించి దారికి తెచ్చారు. ఇపుడు మరో సీనియర్ నేత గట్టిగా గర్జిస్తున్నాడు.

ఎపుడూ బోయీలమేనా ..?

పార్టీ కోసం పనిచేసే బోయీలమేనా అంటూ సీనియర్ నేత గాడు అప్పలనాయుడు గుస్సా అవుతున్నారు. భీమిలీ ఇంచార్జిని ఎవరిని అడిగి నియమించారు అంటూ నిప్పులు కక్కుతున్నారు. పార్టీలో ఏం జరుగుతున్నా తమను సంప్రదించరా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయన భీమిలీ మండల అధ్యక్షునిగా గెలిచి అయిదేళ్ళ పాటు పనిచేశారు. ఆయన సతీమణి రెండవ వార్డు కార్పోరేటర్ గా ఉన్నారు. ఇపుడు ఈ దంపతులు ఇద్దరూ పార్టీకి గుడ్ బై కొట్టాలని చూస్తున్నారుట. తమకు భీమిలీ టికెట్ మీద హామీ ఇస్తేనే ఉంటామని చెబుతున్నారుట. బలమైన సామాజికవర్గానికి చెందిన ఆయన కనుక తిరుగుబాటు జెండా ఎగరేస్తే టీడీపీకి పుట్టెడు కష్టాలు తప్పవని తమ్ముళ్ళు అంటున్నారు.

ఈయనా అంతేనా ..?

మరో వైపు భీమిలీ పట్టణ ప్రెసిడెంట్ గా ఉన్న గంటా నూకరాజు కూడా మత్య్సకార కోటాలో తనకు సీటు ఖాయమని ఇన్నాళ్ళూ నమ్మకంగా ఉన్నారు. ఇపుడు ఆనందపురానికి చెందిన కోరాడ రాజబాబుని ప్రకటించడంతో ఆయన కూడా ఫుల్ సైలెంట్ అయ్యారు. పార్టీకి సంబంధం లేనట్లుగా ఉన్నారు. దీంతో భీమిలీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. వచ్చే ఎన్నికల్లో వీరంతా పోటీ అంటే కచ్చితంగా పార్టీకి మైనస్ గానే మారుతుంది. దీంతో ఎవరిని బుజ్జగించాలో, ఎవరిని సముదాయించాలో తెలియక జిల్లా పెద్దలు బాబు వైపు చూస్తున్నారుట. ఈ పరిణామాలు వైసీపీకి మహదానందంగా ఉన్నాయనడంలో సందేహమే లేదుగా.

Tags:    

Similar News