లాక్ చేసినట్లుందే?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పడం క‌ష్టం. ఎల్లప్పుడూ దూకుడు రాజ‌కీయాలు క‌లిసి వ‌స్తాయని చెప్పలేం. అలాగ‌ని సైలెంట్‌గా ఉంటే మంచిద‌నీ అన‌లేం. స‌మ‌యానికి త‌గిన విధంగా [more]

Update: 2020-02-27 02:00 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పడం క‌ష్టం. ఎల్లప్పుడూ దూకుడు రాజ‌కీయాలు క‌లిసి వ‌స్తాయని చెప్పలేం. అలాగ‌ని సైలెంట్‌గా ఉంటే మంచిద‌నీ అన‌లేం. స‌మ‌యానికి త‌గిన విధంగా వ్యవ‌హ‌రిస్తేనే రాజకీయాల్లో మ‌న‌గ‌లుగుతాం అనేది వాస్తవం. అయితే, చాలా మంది నాయ‌కులు ఈ వాస్తవానికి దూరంగా అడుగులు వేస్తున్నారు. దీంతో వారి భ‌విష్యత్తును వారే నాశ‌నం చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దూకుడు ఆయ‌న‌కు ఫ్యూచ‌ర్ లేకుండా చేస్తోంద‌నే వ్యాఖ్యలు వినిపించేలా చేస్తోంది.

వైసీపీలో చేరి…..

బైరెడ్డి కుటుంబానికి రాజ‌కీయ ఫాలోయింగ్ బాగానే ఉంది. బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి గ‌తంలో ప్రత్యేక సీమ కోసం పోరాటం చేశారు. దీనికి ముందు టీడీపీలో ఉన్నారు. ఇక‌, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఈయ‌న త‌మ్ముడి కుమారుడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న సిద్ధార్థ రెడ్డి జ‌గ‌న్ మ‌న‌సును ఆక‌ట్టుకుని వెంట‌నే నందికొట్కూరు ఇంచార్జ్ ప‌ద‌విని ద‌క్కించుకుని దూకుడు రాజ‌కీయాలు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్‌కు సిద్దార్థకు మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది.

నామినేటెడ్ పదవి…..

దీనిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు జ‌గ‌న్‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యం తెలిసి కూడా సిద్దార్థ రెడ్డి లైట్ తీసుకున్నారు. వాస్తవానికి జ‌గ‌న్ సిద్దార్థ రెడ్డికి నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వాల్సి ఉంది. త్వర‌లోనే దీనిపై క్లారిటీ ఉంటుంద‌ని అందరూ అనుకున్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల ప‌ద‌వులు నామినేటెడ్‌గా భ‌ర్తీ చేశారు. ఈ ప‌ద‌వుల్లో క‌ర్నూలు జిల్లాకు సంబంధించి ఏదో ఒక ప‌ద‌వి ఇస్తార‌ని అనుకున్నారు. కానీ, సిద్దార్థ రెడ్డి వ్యవ‌హార శైలి, ఆయ‌న‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న జ‌గ‌న్‌ ఆయ‌న‌కు ప్రత్యేకంగా ప‌ద‌వి ఇస్తే మ‌రిన్నివివాదాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌.

మిగిలిన నేతలు సయితం….

దీనికితోడు చాలా మంది నాయ‌కులు ఇప్పటికే నామినేటెడ్ ప‌ద‌వి కోసం ఎదురు చూస్తు న్నారు. యువ‌కుడు, ఇటీవ‌లే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సిద్ధార్థ రెడ్డికి ప‌దవి ఇస్తే వీరంతా పార్టీకి దూర‌మ‌య్యే ప్రమాదం ఉంద‌ని గుర్తించిన జ‌గ‌న్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంశాన్ని ప్రస్తుతానికి ప‌క్కన పెట్టార‌ని అంటున్నారు. ఇక జిల్లాలో ఉన్న మంత్రులు, వైసీపీ నేత‌లు సైతం సిద్ధార్థ రెడ్డి దూసుకు పోతుండ‌డంతో త‌మ‌ను ఎక్కడ డామినేట్ చేస్తాడో ? అన్న ఆందోళ‌న‌తో ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చేందుకు ఒప్పుకోలేద‌న్న గుస‌గుస‌లు కూడా ఉన్నాయి. ఏదేమైనా త‌న ప‌నితాను చేసుకుని ముందుకు సాగి ఉంటే ప‌రిస్థితి ఇలా ఉండేది కాద‌ని బైరెడ్డి అనుచ‌రులు చెబుతున్నారు.

Tags:    

Similar News