బైరెడ్డికి ఆ ఛాన్సే దొరకదట..?

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క‌ర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ‌నేత‌. వ‌య‌స్సు ప‌రంగా చాలా చిన్న… ఇంకా నూనుగు మీసాలు వ‌య‌స్సులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. టీడీపీ ప్రభుత్వ [more]

Update: 2021-07-02 13:30 GMT

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క‌ర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ‌నేత‌. వ‌య‌స్సు ప‌రంగా చాలా చిన్న… ఇంకా నూనుగు మీసాలు వ‌య‌స్సులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో పార్టీలో త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై విబేధించిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీలోకి వ‌చ్చారు. జ‌గ‌న్ బైరెడ్డిపై ఉన్న న‌మ్మకంతో పాటు వాగ్దాటిని మెచ్చుకుని ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయినా ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తొగురు అర్థర్‌కు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి నిత్యం వార్ జ‌రుగుతూనే ఉంది. అదిగో పులి… ఇదిగో మేక అన్న చందంగా బైరెడ్డికి కీల‌క ప‌ద‌వి వ‌చ్చేస్తోందంటూ కొద్ది రోజులుగా ప్రచారాలు న‌డుస్తూనే ఉన్నాయి. ముందు డీసీసీబీ చైర్మన్ ప‌ద‌వి అన్నారు.. డీసీఎస్ఎంస్ ఇస్తార‌న్న ప్రచార‌మూ ఉంది. ఆవేవి జ‌గ‌న్ ఇవ్వలేదు.

ఎమ్మెల్సీ పదవి అంటూ….

త‌ర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి ఎమ్మెల్సీ అని మ‌రో పుకారు పుట్టించారు. ఎమ్మెల్సీ స్థాయి ప‌ద‌వి కాక‌పోయినా జిల్లా స్థాయిలో కీల‌క ప‌ద‌వి ఆయ‌న‌కు వ‌చ్చేదే. అయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి దూకుడుతో బెంబేలెత్తుతోన్న సీనియ‌ర్లే ఆయ‌న‌కు ప‌ద‌వి రాకుండా జ‌గ‌న్ ద‌గ్గర చేసిన లాబీయింగ్‌లో స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. బైరెడ్డి మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ తో ఏ విష‌యంలో అయినా ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లోనే ఉంటున్నారు. ఎన్నోసార్లు పంచాయితీలు చేసినా అవేవి ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు నియోజ‌క‌వర్గంలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో కూడా మూడు మండలాల పెత్తనం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి, రెండు మండ‌లాల పెత్తనం ఎమ్మెల్యే ఆర్ధర్‌కు అప్పగించారు. క‌ట్ చేస్తే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి మ‌రో ఎమ్మెల్యేతో వివాదం త‌ప్పేలా లేదు.

అసెంబ్లీకి వెళ్లాలని…..

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి అసెంబ్లీ మెట్లెక్కాల‌న్న బ‌ల‌మైన కోరిక ఉంది. ఈ క్రమంలోనే నందికొట్కూరు ప‌క్కనే ఉన్న పాణ్యం నుంచి త‌న‌కు ఛాన్స్ రాక‌పోదా ? అన్న ఆశ ఉంది. ఇందుకోస‌మే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాణ్యంపై కూడా ఓ క‌న్నుతో చూసీ చూడ‌న‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌. ఆ మాట‌కు వ‌స్తే ఆయ‌న క‌ర్నూలు జిల్లాలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. పాణ్యంలో కాట‌సాని రాం భూపాల్ రెడ్డి సీనియ‌ర్ ఎమ్మెల్యే. ఆయ‌న ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. జ‌గ‌న్ ఆయ‌న్ను ఏరికోరి మ‌రీ పార్టీలోకి తెచ్చుకున్నారు. ఆయ‌న కోస‌మే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డిని ప‌క్కన పెట్టారు.

అలెర్ట్ అయిన కాటసాని….

అయితే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి దూకుడు నేప‌థ్యంలో కాట‌సాని ఎలెర్ట్ అయిపోయార‌ట‌. ఆయ‌న త‌న రాజ‌కీయ వార‌సుడిగా త‌న కుమారుడు కాట‌సాని శివ‌న‌ర్సింహా రెడ్డిని తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎప్పుడు అయినా పాణ్యం వైపు చూస్తాడేమో.. అస‌లు ఆ ఛాన్సే ఇవ్వకూడ‌ద‌ని త‌న కుమారుడి క్రియాశీల‌క రాజ‌కీయాల్లో యాక్టివ్ చేసేశారు. ప్రస్తుతం పాణ్యంలో వ్యవ‌హారాలు అన్నింటిని శివ‌న‌ర్సింహారెడ్డే చూస్తున్నారు. రాంభూపాల్ రెడ్డి సీనియ‌ర్ కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌ప్పుకున్నా.. శివ‌న‌ర్సింహారెడ్డే పాణ్యం వైసీపీ టిక్కెట్ రేసులో ఉండ‌డం ఖాయం.

Tags:    

Similar News