కేసీఆర్ ను కట్టడి చేయాలంటే?

గట్టి నేతల ఆటలు కట్టించే విద్యలో కేంద్రంలోని మోడీ, అమిత్ షాలు ఆరితేరిపోయారు. ఇపుడు తెలంగాణాలో పాగా వేయాలన్నది బీజేపీ తాపత్రయం. అయితే ఇలా అంది అలా [more]

Update: 2019-11-03 03:30 GMT

గట్టి నేతల ఆటలు కట్టించే విద్యలో కేంద్రంలోని మోడీ, అమిత్ షాలు ఆరితేరిపోయారు. ఇపుడు తెలంగాణాలో పాగా వేయాలన్నది బీజేపీ తాపత్రయం. అయితే ఇలా అంది అలా పట్టు తప్పుతోంది. లోక్ సభ ఎన్నికల్లో గెలిచామన్న సంబరం అలా ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలో బీజేపీ చతికిలపడింది. ఇక తాజాగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏకంగా డిపాజిట్లు పోగొట్టుకుంది. దాంతో ఇపుడున్న స్థితిలో తెలంగాణ రాష్ట్రం రూపు రేఖలు ఉంటే ఎప్పటికీ గెలవం అని బీజేపీ హై కమాండ్ డిసైడ్ అయిందట. దాంతో కొత్త వ్యూహాలతో, ఎత్తులతో ముందుకు వస్తోందిట. దానిలో భాగమే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే టీఆర్ఎస్ కి కళ్ళెం పడినట్లేనని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

విభజన నాటి డిమాండ్…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ముక్కలు చేయమని టీఆర్ఎస్ ఉద్యమం చేస్తున్నపుడు సీమాంధ్రవాసులు ఒక ప్రతిపాదన పెట్టారు. రెండు ప్రాంతాలకు హైదరాబాద్ కేంద్ర బిందువు కాబట్టి దాన్ని యూటీ చేయమని కాంగ్రెస్ నాయకులు నాడు గట్టిగా కోరారు. ఓ దశలో అప్పటి యూపీయే సర్కార్ దాన్ని నిశితంగా పరిశీలించిందని ప్రచారంలో ఉంది. అయితే తలకాయ లేని మొండెం మాకెందుకు అంటూ కేసీఆర్ మడత పేచీ పెట్టేసరికి వెనక్కు తగ్గారని అంటారు. ఇక బంగారు బాతు గుడ్డు లాంటి హైదరాబాద్ తో తెలంగాణాను సాధించి కేసీఆర్ హీరో అయ్యారు. దేశంలోని అతి కొద్ది సంపన్న రాష్ట్రాలో తెలంగాణా ఒకటి కావడం వెనక హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ మొత్తం తెలంగాణా రాష్ట్ర ఆదాయంలో ఎనభై శాతం పైగా సమకూరుస్తోంది. హైదరాబాద్ దక్షిణాది ఢిల్లీగా పేర్కొంటారు. ఎంతో ప్రాధాన్యత రాజకీయంగా, భౌగోళికంగా, ఆర్ధికంగా కలిగిన ఈ మహానగరం అండ చూసుకునే కేసీఆర్ రాజకీయంగా బలవంతుడుగా మారారని బీజేపీ అంచనా వేస్తోంది.

కాశ్మీర్ ముక్కలవగా లేనిది…:

హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఇప్పటికీ ఉంది. అయితే డెబ్బయ్యేళ్ళ సమస్య అయిన కాశ్మీర్ నే మూడు ముక్కల్గా చేసిన బీజేపీకి హైదరాబాద్ ఒక లెక్కా అన్న సమాధానం వెంటనే దొరుకుతుంది. పైగా ఇపుడు కేంద్రంలో పటిష్టమైన నాయకత్వం మోడీ రూపంలో ఉంది. అప్పట్లో యూపీయే సర్కార్ కి బలహీనమైన ప్రధాని ఉన్నందున సీమాధ్రుల కోరిక మన్నించలేకపోయారని అంటారు. ఇప్పటికీ హైదరాబాద్ ని పోగొట్టుకున్నామన్న బాధ ఆంధ్రులలో ఉంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా హైదరాబాద్ ని యూటీని చేస్తే అక్కడ కేసీఆర్ కి గట్టి ఝలక్ తగులుతుంది. ఇక్కడ సీమాంధ్రలో బలం పుంజుకోవచ్చునని బీజేపీ ఆలోచన చేస్తోందని అంటున్నారు. పైగా హైదరాబాద్ కి ఉగ్ర ముప్పు ఉంది, పాక్ నుంచి వచ్చే వారికి అక్రమంగా పాతబస్తీలో ఆశ్రయం కల్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో చూసుకుంటే దేశ భద్రత పేరు చెప్పి బీజేపీ యూటీగా హైదరబాద్ ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు, కేసీఆర్ కామెంట్స్ నేపధ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుంది ముసళ్ళ పండుగ అన్నారు. దాని అర్ధం ఇదేనా అని ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

Tags:    

Similar News