ఆ భాగ్యాన్ని పోగొట్టిందెవరు… ?

రాజకీయమంటే నిన్నటి మాటను మరచిపోవడం. తమ తప్పుని ఎదుటి వారి మీద నెట్టేయడం. కానీ జనాలు గమనిస్తున్నారు అన్న స్పృహ ఏ మాత్రం ఉన్నా కూడా నేతలు [more]

Update: 2021-05-16 06:30 GMT

రాజకీయమంటే నిన్నటి మాటను మరచిపోవడం. తమ తప్పుని ఎదుటి వారి మీద నెట్టేయడం. కానీ జనాలు గమనిస్తున్నారు అన్న స్పృహ ఏ మాత్రం ఉన్నా కూడా నేతలు అలవోకగా అబద్ధాలు చెప్పరు. విచిత్రమైన వైఖరులతో విన్యాసాలు కూడా చేయరు. ఎవరేమనుకున్నా బంగారు లాంటి భాగ్యనగరం పదమూడు జిల్లాల ఆంధ్రులకు దూరమైంది. విభజనతో ఏపీకి రాజధాని లేని రాష్ట్రం దక్కింది. అయినా విభజన చట్టంలో కొంత కనికరించి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు అవకాశం కల్పించారు. ఈ రోజుకు కూడా మూడేళ్ల దాకా ఆ హక్కు అవకాశం ఏపీ జనాలకు ఉన్నాయి.

ఉన్న చోటనే పరాయిగా…..?

ఏపీ తెలంగాణాల బంధానికి షష్టి పూర్తి ఉత్సవం జరిగింది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఏనాడూ హైదరాబాద్ తనకు కాకుండా పోతుందని సగటు ఆంధ్రుడు భావించలేదు. ఇక ముఖ్యమంత్రులుగా చేసిన వారు సైతం అదే నమ్మి ఉమ్మడి ఏపీకి రాజధాని అని అభివృద్ధి చేశారు. ఇలాంటి పరిస్థితులలో అన్ని రకాలైన విద్య, ఉపాధి వైద్య సదుపాయాలు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఏపీలో ఏ జిల్లావాసికి మరే పెద్ద కష్టం వచ్చినా పరిగెత్తుకువచ్చేది హైదరాబాద్ కే. అటువంటి హైదరాబాద్ కి కరోనా వేళ రావద్దు అని సరిహద్దులు మూసేసే కాఠిన్యం చూపిస్తే ఎలా అన్నదే ఆంధ్రుల ఆవేదన.

బాబుదే తప్పు….

తాను అపర చాణక్యుడిని అని చెప్పుకునే చంద్రబాబు సొంత రాజకీయం కోసం అనేక తప్పులు చేశారు. అందులో అత్యంత ముఖ్యమైనది హైదరాబాద్ మీద ఉమ్మడి రాజధాని హక్కులను వదులుకుని రాత్రికి రాత్రి విజయవాడ రావడం. విభజన తరువాత కేవలం ఏడాది మాత్రమే ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. 2015లో ఆయన విజయవాడ వచ్చేసారు. అమరావతి రాజదాని అంటూ నాలుగేళ్ల పాటు కాలక్షేపం చేసిన దానికి పరిహారంగా 2019 ఎన్నికల్లో ఓడారు. సరే ఆయన రాజకీయం ఎలా ఉన్నా కానీ ఆంధ్రులకు మాత్రం తీరని అన్యాయం జరిగింది అన్నది తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. వీటికి ముందు అనేకం కూడా ఇలాంటివి జరిగాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉంటూ ఏపీని అభివృద్ధి చేసుకుంటే బాబుని కాదనేవారు ఎవరు. ఆయన ఓటుకు నోటు కేసు విషయంలో రాజీపడి ఏపీకి వచ్చేశారు అని అంటారు.

సాధ్యమయ్యేనా…?

ఇప్పటికీ చంద్రబాబు సహా మాజీ ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. అన్ని రకాలుగా అది మహానగరం అనే వారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆ విషయంలో వారిని ఎవరూ తప్పు పట్టేది లేదు కూడా. ఆ మాటకు వస్తే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ పెద్దలు, ధనవంతులు అంతా కూడా హైదరాబాద్ లోనే కాపురం ఉంటున్నారు. మరి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కోల్పోయినందుకు భారీ మూల్యం చెల్లిస్తోంది మాత్రం పేదలు, ఏపీని నమ్ముకుని ఉన్న వారే. హైదరాబాద్ అభివృద్ధి ఒక్క రోజులో జరగలేదు. అలాంటి నగరం లాంటిది ఏపీలో రావాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది అన్నది కూడా ఎవరూ చెప్పలేరు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ అవసరం అన్ని విధాలుగా ఏపీ జనాలకు ఎప్పటికీ ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలసి ఉందామన్న మాటకు రెండు ప్రాంతాల ఏలికకు కట్టుబడి ఉండాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. అంతే తప్ప కుత్సిత రాజకీయాల కోసం జనాలను బలి పెట్టడం తగని పని అనే అంతా అంటున్న మాట.

Tags:    

Similar News