ఆ నాలుగు గంటలు పాతవే గుర్తుకు వచ్చాయటగా

వైసిపి పాలన తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం అధినేత కు జరుగుతున్న అడుగడుగునా అవమానాలకు కారణాలు ఏమిటన్న చర్చ నేడు ఏపీలో లో మొదలైంది. ఆయన 14 [more]

Update: 2020-02-28 02:00 GMT

వైసిపి పాలన తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం అధినేత కు జరుగుతున్న అడుగడుగునా అవమానాలకు కారణాలు ఏమిటన్న చర్చ నేడు ఏపీలో లో మొదలైంది. ఆయన 14 ఏళ్ళ పరిపాలనలో అధికారం చేతిలో ఉండగా చంద్రబాబు అనుసరించిన విధానాలు ఆయనకే జగన్ రుచి చూపిస్తున్నారని తేలిపోతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను గద్దెదించే ముందు వైశ్రాయి వేదికగా ఎమ్యెల్యేల చేత చెప్పులు వేయించారు నాడు చంద్రబాబు. సొంత మామ గారు పార్టీ అధినేత పై జరిగిన ఈ దాడిని ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని తేల్చేశారు. పత్రికా వ్యవస్థను, అధికార యంత్రంగాన్ని గుప్పిట పెట్టుకుని వ్యవస్థలను మ్యానేజ్ చేసి నాడు చంద్రబాబు చేసిన ధిక్కారాన్ని నేడు వైసిపి పాతికేళ్ళ తరువాత ప్రశ్నిస్తుందని టిడిపి అధినేత ఉహించి వుండరంటున్నారు.

విద్యుత్ ఉద్యమంలో …

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలను తగ్గించాలని ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి సర్కార్ తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. ఆనాడు ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులను ప్రయోగించి కాల్పులకు సైతం దిగి పలువురి ప్రాణాలు పోయేలా ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించింది. బషీర్ బాగ్ కాల్పులు ఇప్పటికి చీకటి రోజులను గుర్తు చేస్తాయి. నాడు విపక్ష నేతగా వైఎస్ ఆమరణ దీక్ష చేస్తుంటే ఉద్యమ శిబిరంపైనా పోలీసులు దాడి చేసి ఆయన దీక్షను భగ్నం చేసేసారు. ఇలా చంద్రబాబు 9 ఏళ్ళ పాలన అంతా పోలీస్ రాజ్యంగానే సాగిందని వైసిపి గుర్తు చేస్తుంది.

దళిత ఉద్యమాలను ఉక్కుపాదంతో …

చంద్రబాబు పాలనలో సాగిన దళిత ఉద్యమాలను చంద్రబాబు సర్కార్ 2014 తరువాత ఉక్కుపాదంతో అణచివేసింది. మంద కృష్ణ మాదిగ ఎస్సి వర్గీకరణ పై చేసిన పోరాటాలు ఆ తరువాత అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం, దళితులపై వివక్ష, దళితులపై అత్యాచార అంశాలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ చేపట్టిన ఉద్యమాలను తొక్కేసి కేసులు పెట్టింది చంద్రబాబు సర్కార్. నెలల తరబడి హర్ష కుమార్ కి గృహ నిర్బంధం తప్పనే లేదు. ఇక అనేక వందల మంది దళిత నాయకులకు గృహ నిర్బంధాలు షరా మాములుగా అయిపోయేది అని వైసిపి గుర్తు చేస్తుంది.

ముద్రగడ కాపు ఉద్యమం లో మరీ దారుణంగా …

ఇక కాపు రిజర్వేషన్ల అంశంలో ఉద్యమం మొదలు పెట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి చంద్రబాబు సర్కార్ చుక్కలు చూపించింది. తుని లో జరిగిన విధ్వంసాన్ని సాకుగా చూపి ముద్రగడ కుటుంబాన్ని దీక్ష విరమణ కోసం చితక్కొట్టారు పోలీసులు. ముద్రగడను రాజమండ్రి ఆసుపత్రిలో రెండు వారాలకు పైగా ఉంచి రోగులను సైతం వెళ్లనీయకుండా పరిసరాల్లో ముళ్ల కంచె పరిచారు పోలీసులు. ఆ తరువాత ఆయన ఏ ఉద్యమాన్ని చేపట్టాలన్నా గృహ నిర్బంధం లో ఉంచి పోలీస్ మార్క్ ఎలా ఉంటుందో రుచి చూపించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ముద్రగడకు మద్దతుగా కాపు నేతలు కానీ ఉద్యమ కార్యకర్తలు ఎవరు రాకుండా అనధికార జెడ్ క్యాటగిరి ఐదేళ్లపాటు కొనసాగించింది నాటి చంద్రబాబుసర్కార్ అని వైసిపి చెబుతుంది.

జగన్ కి చేదు అనుభవాలు …

విపక్ష నేతగా విశాఖలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు వచ్చిన జగన్ ను రన్ వే పైనే చంద్రబాబు సర్కార్ అరెస్ట్ చేయించింది. బలవంతంగా ఆయన్ను హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించింది నాటి ప్రభుత్వం. ఆ తరువాత విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసు లోను నాటి అధికార టిడిపి ఆ హత్యాయత్నం కేసును నవ్వులాటగా ప్రచారం సాగించింది. అలాగే వైసిపి అధినేతగా జగన్ పాదయాత్ర కు కోర్టు ద్వారా అనేక అడ్డంకులు కల్పించింది అని ఫ్యాన్ పార్టీ జ్ఞప్తికి తెస్తుంది. పాదయాత్రకు జిల్లా జిల్లాకు రూట్ మ్యాప్ పరిశీలించి ఆ తరువాతే ఎప్పటికప్పుడు పర్మిషన్లు ఇచ్చారని నాటి చేదు అనుభవాలు తమ్ముళ్ళకు గుర్తు చేస్తున్నారు.

మంటగలుస్తున్న ప్రజాస్వామ్యం …

గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ సర్కార్ ఒకే రీతిలో సాగడంపై ప్రజాస్వామ్య వాదులు ఖండిస్తున్నారు. టిడిపి చేసిన వాటికి భిన్నంగా తమ ప్రభుత్వం సాగుతుందని ప్రచారం చేసుకుంటున్న వైసిపి సర్కార్ నిర్బంధాలు, హక్కుల అణచివేత, ఆంక్షలు, అరెస్ట్ లు గృహ నిర్బంధాల్లో చంద్రబాబు రూట్ ను మాత్రం తూచా తప్పకుండా అనుసరిస్తుంది. అది కూడా అంతకు మించే వ్యవహారం చేస్తూ ఉండటం ఆందోళనకరమే. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. కానీ ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తే రేపు వైసిపి సర్కార్ తరువాత వచ్చే ఏ ప్రభుత్వం అయినా ఇదే దారిని అంతకు మించి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ కి లేదా వ్యక్తి కి అయినా తమ పార్టీ వాదన ప్రజల్లోకి తీసుకువెళ్ళే హక్కు అధికారం రాజ్యాంగం కల్పించింది. దీన్ని పక్కన పెట్టి తమకు జరిగిన అనుభవాలను చంద్రబాబు కి రుచి చూపించాలన్న ఆలోచన లోనే అధికారపార్టీ అనుసరిస్తే ప్రజాస్వామ్యం ప్రతీసారి అపహాస్యం అవుతున్నట్లే అన్నది విశ్లేషకుల ఆందోళన.

Tags:    

Similar News