కాలం చెల్లినట్లేనా? నాటి వైభవం రాదంటున్న తమ్ముళ్ళు ?

తెలుగుదేశం పార్టీ పుట్టింది లగాయితూ ఆదరిస్తూ వస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాలు ఇపుడు కొత్త రూట్లోకి వెళ్తున్నాయి. నిజానికి ఈ జిల్లాలు ఎపుడూ నాన్ కాంగ్రెస్ రాజకీయాన్నే అనుసరిస్తూ [more]

Update: 2020-10-06 14:30 GMT

తెలుగుదేశం పార్టీ పుట్టింది లగాయితూ ఆదరిస్తూ వస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాలు ఇపుడు కొత్త రూట్లోకి వెళ్తున్నాయి. నిజానికి ఈ జిల్లాలు ఎపుడూ నాన్ కాంగ్రెస్ రాజకీయాన్నే అనుసరిస్తూ వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ కి ధీటుగా బలమైన ప్రతిపక్ష నేతలుగా తెన్నేటి విశ్వనాధం, గౌతు లచ్చన్న వంటి వారు ఉండేవారు. కాలగమనంలో ఆ వ్యతిరేకత మరింతగా పెరిగి కాంగ్రెస్ కి యాంటీగా పార్టీ పెట్టిన టీడీపీకి పూర్తిగా అనుకూలించింది. ఆ మీదట టీడీపీ కంచుకోటను కదిలించడం వైఎస్సార్ వంటి చరిష్మాటిక్ లీడర్ వల్ల కూడా కాలేదు. అయితే జగన్ మాత్రం 2019 ఎన్నికల్లో ఒక్క పెట్టున టీడీపీ కోటలను కూల్చేశారు.

మరింతగానా….?

అది లగాయితూ టీడీపీ ఇంకా కుంగిపోతూ వస్తోంది తప్ప ఏ మాత్రం కుదుటపడే చాన్స్ జగన్ ఇవ్వడంలేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా మూడు రాజధానుల ప్రతిపాదంతో జగన్ తెలివిగా విశాఖ సిటీని తన వైపు తిప్పుకున్నారు. ఇక్కడ స్ట్రాంగ్ అనుకున్న టీడీపీకి ఒక బలమైన బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జంప్ కావడంతో చుక్కలు కనిపించాయి. మరో ఇద్దరి మీద కూడా వైసీపీ కన్ను పడింది అని తెలియడంతో టీడీపీ అప్రమత్తం అయింది. పార్టీ పదవుల్లో వారిని సెట్ చేసి పెట్టింది. కానీ లోలోపల బెంగా బెరుకూ అలాగే ఉన్నాయి. మరో వైపు వైసీపీ గట్టిగా టార్గెట్ చేస్తోంది కూడా. దాంతో మరెన్ని వికెట్లు పడాతాయో అన్న డౌట్ మాత్రం టీడీపీని పట్టిపీడిస్తోంది.

మాజీలకు గేలం…?

ఇక మరో వైపు చూసుకుంటే బీజేపీ కూడా ఉత్తరాంధ్రా మీద గట్టిగా దృష్టి పెట్టింది. ఆ పార్టీ అటు వైసీపీ, ఇటు టీడీపీకి చెందని వారి మీద గురిపెట్టి మరీ బాణాలు వేస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బిగ్ షాట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావుని బీజేపీలోకి తెచ్చేందుకు సోము వీర్రాజు స్వయంగా పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. గంటా కనుక వస్తే ఆయన వెంట పెద్ద బలగమే బీజేపీలోకి వస్తుందని సోము అంచనా వేసుకుంటున్నారు. దాంతో గంటాను ఆయన లైన్ లో పెట్టడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఇక విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి సుజయ‌ క్రిష్ణ రంగారావుని కూడా బీజేపీ బాటన పట్టించడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారుట.

ఇక కుదేలేనా…?

ఓ వైపు చూస్తే వైసీపీ, మరో వైపు బీజేపీ ఇలా విరుచుకుపడిపోవడంతో టీడీపీకి ఏం చేయాలో అర్ధం కాని స్థితి. బీసీల దన్ను తో ఇంతకాలం నెట్టుకువచ్చిన చంద్రబాబుకు జగన్ అదే వ్యూహంతో గట్టి షాక్ ఇస్తున్నారు. బీసీలనే ముందు పెట్టి జగన్ చేస్తున్న రాజకీయంతో ఉత్తరాంధ్రలో పొలిటికల్ సీన్ మొత్తం మారుతోంది. మరో వైపు రాజధాని ప్రకటనతో టీడీపీ నేతలకు గేలం వేస్తూ ద్విముఖ వ్యూహం జగన్ అనుసరిస్తున్నారు. జాతీయ పార్టీగా తాము తమ్ముళ్ళకు సేఫ్ షెల్టర్ ఇస్తామంటూ బీజేపీ మరో వైపు పోటీ పడుతోంది. ఈ నేపధ్యంలో తమ్ముళ్ళను కాచుకోవడం చంద్రబాబుకు కత్తి మీద సామే అవుతోంది. అయితే ఒకటి మాత్రం స్పష్టం. ఉత్తరాంధ్రలో గతంలో మాదిరిగా టీడీపీ ఏకపక్ష రాజకీయాలకు కాలం చెల్లినట్లేనన్నదే ఆ వాస్తవం. దాంతో ఉన్నంతలో పరువు పోకుడా ఉనికి కాపాడుకోవడమే బాబు ముందున్న లక్ష్యం.

Tags:    

Similar News