బాబు ఆ ప్రకటనకు నేతలు నవ్వుకుంటున్నారా?

రాజకీయాల్లో పార్టీలు మారడం కామన్ అయిపోయింది. పార్టీ వేవ్ ఉంటే దానివైపు వచ్చేందుకు నేతలు క్యూ కడతారు. గెలుపు అవకాశాన్ని ఏ నేత వదులుకోరు. తన నాయకత్వంతో [more]

Update: 2021-09-18 08:00 GMT

రాజకీయాల్లో పార్టీలు మారడం కామన్ అయిపోయింది. పార్టీ వేవ్ ఉంటే దానివైపు వచ్చేందుకు నేతలు క్యూ కడతారు. గెలుపు అవకాశాన్ని ఏ నేత వదులుకోరు. తన నాయకత్వంతో పాటు వేవ్ ఉన్న పార్టీ అయితే గెలుపు సులువవుతుందని నేతలు నమ్ముతారు. కానీ చంద్రబాబు మాత్రం పార్టీని వీడిన వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరని ఇటీవల సీనియర్ నేతల సమావేశంలో చెప్పారు. అయితే ఈ నిర్ణయంపైనే తెలుగుదేశం పార్టీలో చర్చ మొదలయింది.

అనేక మంది నేతలకు…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై స్టాండ్ అవుతారా? లేదా? అన్నది అనుమానమే. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు అనేక మంది నేతలు చంద్రబాబును వీడి వెళ్లారు. అయితే ఆ తర్వాత అదే నేతలను చంద్రబాబు దగ్గరకు చేర్చుకున్నారు. కళా వెంకట్రావు వంటి నేతకు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా చంద్రబాబు నియమించారు.

మళ్లీ వస్తే….

ఇక 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి పార్టీలోకి చేర్చుకున్నారు. వారిలో కొందరికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు పార్టీ ని వీడిన వారికి వచ్చే ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వనని చంద్రబాబు చెప్పినా నేతలకు మాత్రం నమ్మకం లేదు. ఇందుకు చాలా ఉదాహరణలు వారు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అలా అయితే బీజేపీలోకి వెళ్లిన వరదాపురం సూరి, ఆదినారాయణరెడ్డిలతో పాటు మరికొందరు నేతలను కూడా పక్కన పెట్టాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

చివరి నిమిషంలో వచ్చే వారికి కూడా…

చంద్రబాబు పార్టీ వీడిన వారికి టిక్కెట్లు ఇవ్వనని చెప్పడం వరకూ బాగానే ఉంది. మరి రానున్న కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఆయన టిక్కెట్ లు ఇవ్వరన్న గ్యారంటీ ఉందా? అన్న ప్రశ్న కూడా గట్టి గానే విన్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్ ఛార్జులలో జోష్ నింపేందుకే చంద్రబాబు ఆ ప్రకటన చేశారంటున్నారు. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వక తప్పని పరిస్థితులు ఉంటాయి. రాజకీయాల్లో అది మామూలే. అందుకే చంద్రబాబు ప్రకటనను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.

Tags:    

Similar News