Chandrababu : పదవులపై ఆ నేతలకు బాబు భరోసా

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎవరికి ఇచ్చినా వారు ఎక్కువ కాలం ఉండటం లేదు. కనీసం పార్టీ తమకు పెద్ద పదవి ఇచ్చిందన్న కృతజ్ఞత కూడా లేదు. [more]

Update: 2021-10-01 13:30 GMT

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎవరికి ఇచ్చినా వారు ఎక్కువ కాలం ఉండటం లేదు. కనీసం పార్టీ తమకు పెద్ద పదవి ఇచ్చిందన్న కృతజ్ఞత కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తిన నేతలు చంద్రబాబు మాజీ కావడంతో కన్పించకుండా పోతున్నారు. చంద్రబాబు ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎంతో మందికి పదవులు ఇచ్చారు. వారంతా రాజ్యసభ, పార్లమెంటు సభ్యులుగా పదవులు పొందారు. కానీ ఎప్పుడైతే పార్టీ బలహీనమవుతుందో, కష్టాలున్నాయో ఆ సమయంలో మాత్రం వారు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు.

ఎన్టీఆర్ హయాం నుంచే….

ఎన్టీఆర్ హయాం నుంచే ఈ పరిస్థితి ఉన్నా ఆయనకున్న చరిష్మాకు పెద్దగా పార్టీకి నష్టం జరగలేదు. ఎన్టీఆర్ హాయంలోనూ ఉపేంద్ర, రేణుక చౌదరి వంటి వారు పదవులను పొంది తర్వాత పార్టీని నష్టపర్చే ప్రయత్నం చేశారు. ఇక చంద్రబాబు జమానాలో మైసూరా రెడ్డి, సి.రామచంద్రయ్య, వంగా గీత వంటి వారు రాజ్యసభ పదవులను పొందారు. వీరికి సామాజికవర్గం కోటాలోనే చంద్రబాబు పదవులు ఇచ్చినా పార్టీ నుంచి వెళ్లిపోయారు.

పదవులు ఇచ్చినా….

ఇక 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజ్యసభ పదవులిచ్చిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహనరావులు పార్టీని వీడిపోయారు. బీజేపీలో చేరారు. ఇప్పుడు మరోసారి టీడీపీలో పదవుల పై చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తారని పార్టీ నేతలే చెబుతుండటం విశేషం. అందుకే ఈసారి చంద్రబాబు నుంచి గట్టి హామీ పొందాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఈసారి అలా కాదట….

వర్ల రామయ్య వంటి నేతలు ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న వారినే అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన ఇటీవల చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో కోరినట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు సయితం ఎవరు ఎంటో? తనకు తెలిసిందని, ఈసారి ఆ జాగ్రత్తలు తీసుకుంటానని, ఈ ఐదేళ్లు తన వెంట ఉన్న వారికి అధికారంలోకి రాగానే పదవులు ఇస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. తన జాబితాలో నలుగురైదుగురు నేతలున్నారని వారిని పదవులు వరించడం ఖాయమని చెప్పారని సమాచారం.

Tags:    

Similar News