Chandrababu : ఆ వర్గం దరి చేరితే చాలట.. అందుకే ఈ ప్రయత్నాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కొక్క రంగాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన నుంచి దూరమైన రంగాలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ [more]

Update: 2021-10-12 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కొక్క రంగాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన నుంచి దూరమైన రంగాలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం ప్రధానం. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. రైతు సమస్యలపై పోరాటం ఎక్కువగా చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి వ్యూహరచన కమిటీ సమావేశంలోనూ చంద్రబాబు రైతు సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

2014లో పవర్ లోకి….

చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చింది రైతు రుణ మాఫీ హామీపైనే. అప్పుడు జగన్ ఆ హామీ ఇవ్వనని చెప్పడంతో రైతులోకమంతా చంద్రబాబు పక్షాన నిలిచింది. ఫలితంగా విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు తొలి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఒక్కసారిగా చేయకపోవడం, దశలవారీగా అని చెప్పిన చంద్రబాబు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినా అవి వడ్డీలకే సరిపోవడంతో రైతులు అసంతృప్తికి గురయ్యారు.

రుణమాఫీ అమలు కాకపోవడంతో…

దీంతో 2019 ఎన్నికలలో రైతులు చంద్రబాబుకు దూరమయ్యారు. ప్రధాన వర్గమైన రైతులను దరి చేర్చుకోవడం కోసం చంద్రబాబు తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు నత్తనడకనడుస్తున్నాయని, ఏపీ వరప్రసాది అయిన పోలవరం ప్రాజెక్టుకూడా పూర్తి చేయలేకపోతున్నారని చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. దీంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, రైతులకు ప్రయోజనకరమైన పధకాలను, సబ్బిడీలను ఎత్తివేశారని తెలుగుదేశం పార్టీ పెద్దయెత్తున ఉద్యమాలకు దిగుతోంది.

మరోసారి మచ్చిక చేసుకునేందుకు….

రైతుకోసం పేరుతో ఆందోళలనలను ఇటీవల నిర్వహించింది. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు జగన్ పార్టీ పార్లమెంటులో మద్దతు తెలిపిన విషయాన్ని కూడా చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు. భారీ వర్షాలు, తుపానులతో దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమయిందని ప్రాంతాల వారీగా, పంటల ప్రాతిపదికన ఉద్యమ కార్యాచరణను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. మరి చంద్రబాబు ఉద్యమాలకు రైతులోకం మరోసారి ఆయనకు అండగా నిలబడుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News