Lokesh : లోకేష్ ను దూరం పెట్టి తీరాల్సిందే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ విషయంలో కొంత తర్జన భర్జన పడుతున్నట్లే కన్పిస్తుంది. లోకేష్ ను ప్రమోట్ చేయడం వల్ల తమతో కలసి వచ్చే పార్టీలు [more]

Update: 2021-10-10 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ విషయంలో కొంత తర్జన భర్జన పడుతున్నట్లే కన్పిస్తుంది. లోకేష్ ను ప్రమోట్ చేయడం వల్ల తమతో కలసి వచ్చే పార్టీలు రావేమోనన్న అంచనాలో ఉన్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో లోకేష్ ను ముందుంచి తాను వెనకుండి పార్టీని నడిపించాలనుకున్నారు. కానీ లోకేష్ నాయకత్వంపై పార్టీ నేతలకే నమ్మకం లేకుండా పోయింది. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ఎక్కడకక్కడ ప్లకార్డులు దర్శనమిస్తున్నాయి.

ఆయన నాయకత్వంలో…

దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికలకు లోకేష్ ను దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు కన్పిస్తుంది. లోకేష్ పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి లోకేష్ ఈ ఎన్నికలకు ముందు సైకిల్ యాత్ర చేయాలనుకున్నారు. నాయకుడిగా ఎదిగేందుకు, క్యాడర్ లో తన నాయకత్వం పట్ల నమ్మకం కలిగించేందుకు సైకిల్ యాత్ర ఉపయోగపడుతుందని లోకేష్ భావించారు. తొలుత చంద్రబాబు కూడా ఈ ఆలోచనకు ఓకే చెప్పారు.

ప్రయోగాలకు సమయం కాదని…

కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన పరిస్థితి. ప్రయోగాలకు ఇప్పుడు సమయం కాదు. తన నాయకత్వాన్ని పార్టీ మొత్తం ఆమోదిస్తుంది. అదే సమయంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలనుకోవడం లేదు. పవన్ కల్యాణ‌్ తో కలసి వెళ్లాలన్న నిర్ణయాన్ని దాదాపుగా తీసుకుంది. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుకు గౌరవమిస్తారు. ఆయన నాయకత్వంపై పవన్ కు నమ్మకముంది. జగన్ ను ఓడించాలంటే చంద్రబాబు మాత్రమే లీడర్ గా కన్పించాలని పవన్ కూడా కోరుకుంటారు.

అందుకే బాబు యాత్ర….

ఈ దశలో లోకేష్ తో సైకిల్ యాత్ర చేయించి వారిని దూరం చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అందుకే చంద్రబాబు తానే ప్రజాయాత్ర చేయాలని నిర్ణయించారంటున్నారు. అది బస్సు యాత్ర రూపంలోనే ఉండవచ్చన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ వయసులో చంద్రబాబు పాదయాత్ర వంటి రిస్క్ తీసుకోరు. బస్సు యాత్ర ద్వారా 175 నియోజకవర్గాలను పర్యటించాలన్నది చంద్రబాబు యోచన. అందుకే లోకేష్ సైకిల్ యాత్ర బహుశ ఈ ఎన్నికల్లో ఉండకపోవచ్చు.

Tags:    

Similar News