నిండా ముంచేశారా?

అమరావతి రైతులను నిండా ముంచిన ఘనతను చంద్రబాబు సాధించబోతున్నారు. ఆ విషయం చాలా మంది రైతులకు ఇపుడిపుడే అర్ధమవుతోంది. టీడీపీ మద్దతుదారులు, ఆ పార్టీ నుంచి ఇతర [more]

Update: 2020-01-27 05:00 GMT

అమరావతి రైతులను నిండా ముంచిన ఘనతను చంద్రబాబు సాధించబోతున్నారు. ఆ విషయం చాలా మంది రైతులకు ఇపుడిపుడే అర్ధమవుతోంది. టీడీపీ మద్దతుదారులు, ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్ళిన వారు చెబుతున్న కాకమ్మ కబుర్లు వేరు. రైతులు భూములు ఇచ్చినపుడు కుదుర్చుకున్న ఒప్పందాలు వేరు అని అంటున్నారు. ఆ ఒప్పందాలన్నీ ఏకపక్షంగా ఉండడమే అసలైన ట్విస్టట. రైతులు అమరావతి రాజధాని రాబోతోందని తెలిసి తాము స్వయంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లుగా ఒప్పందపత్రాలపైన సంతకాలు చేసినట్లుగా చెబుతున్నారు. అదే కనుక నిజమైతే ఈ రైతులను చంద్రబాబు నిండా ముంచేసినట్లే.

ఎలా అనుకున్నారో….?

ఇక అమరావతి విషయం తీసుకుంటే రైతులు కానీ చంద్రబాబు సర్కార్ని నమ్మిన ఎన్నారైలు కానీ ఎలా మోసపోయారో అర్ధమవుతుంది. 33 వేల ఎకరాలు, ఎకరం అభివృధ్ధికి రెండు వేల కోట్లు. అంటే లక్షా పదివేల కోట్లు. ఇక అక్కడ అభివృధ్ధి జరిగినా ఒక నగరంగా రూపు దిద్దుకోవడానికి దశాబ్దాలే పట్టే సమయం. అయినా కూడా వీరంతా ఒక ఆకర్షణలో పడి మోసపోయారని అంటున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది లక్షల కోట్ల నిధుల గురించే కాదు, దశాబ్దాల కాలం గురించి. పోనీ పెరిగిన ఆస్తులు తాము చూడకపోయినా తమ‌ వారసులు అనుభవిస్తారని రైతులు భావించినా కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని టేకప్ చేసిన చంద్రబాబు సర్కారే కడదాకా అంటే కొన్ని దశాబ్దాల పాటు ఉంటుందని మరీ లాజిక్ లేకుండా వీరంతా ఎలా నమ్మారన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.

ఆ ఊసే లేదట…

ఇక ఒప్పందాల విషయంలోనూ డొల్లతనం చూపించిన నాటి చంద్రబాబు సర్కార్ రైతులకు నష్టపరిహారం అంటూ ప్రత్యేకంగా చెప్పలేదని అంటున్నారు. ఇదంతా పూర్తిగా స్టడీ చేసిన వారు చెప్పేదేంటి అంటే మూడు పంటలు పండిస్తూ దర్జాగా బతికే రైతన్న చంద్రబాబు అండ్ కో మాయాజలంలో పడి నిండా మునిగారనే. ఇక అభివృధ్ధి ఒప్పంద పత్రంలో సైతం ల్యాండ్ పూలింగ్ విషయం తెలిసి ముచ్చట పడి తన భూమి స్వయంగా తానే రైతు ఇచ్చినట్లుగా సీఆర్డీయేతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అంతే కాదు. మొదట మూడేళ్ళలో ల్యాండ్ అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పినా తీరా అగ్రిమెంట్ రైతులతో అయ్యేనాటికి ఆ మూడేళ్ల హామీని తీసేశారట. మరో వైపు తన భూమిని అభివృధ్ధి చేయకపోయినా ఏ కోర్టులోనూ నష్టపరిహారం కోరనని కూడా రైతుల వద్ద ఒప్పందం సీయార్డీఏ తీసుకుందని అంటున్నారు.

ఇబ్బందులే….

ఇవన్నీ చూసుకున్నపుడు సీయార్డీఏ జాగ్రత్తగానే నాటి చంద్రబాబు సర్కార్ కి అనుకూలంగా మొత్తం అగ్రిమెంట్లను డిజైన్ చేసిందనిపిస్తోంది. అదే ఇపుడు చంద్రబాబు దిగిపోయి అధికారంలోకి వచ్చిన జగన్ కి వరంగా మారిందని అంటున్నారు. ఇక అమరావతి రాజధాని తరలిస్తే రైతులకు మూడు రెట్లు నష్టపరిహారం లక్షల్లో ఇవ్వాలని చెబుతున్నా వారంతా బాధిత జనాలను ఓదార్చే మాటలని అంటున్నారు. మరో వైపు శాసన రాజధానిగా అమరావతే ఉంచుతూ జగన్ సర్కార్ కూడా తెలివైన ఎత్తుగడే వేసిందని అంటున్నారు. దీనివల్ల కోర్టుల్లో సైతం రాజధాని లేదని చెప్పడానికి వీల్లేకుండా ఉంటుంది. కీలక విభాగాల తరలింపు మాత్రం జరిగిపోతుంది. ఇవన్నీ చూసుకున్నపుడు ఓ విధంగా రైతులు ఇపుడు అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తో ముందుకు సాగితేనే వారికి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లేకపోతే చంద్రబాబుతో పోరాటాలు ఎంత చేసినా ఫలితం మాత్రం ఉండదని తెలుస్తోంది.

రాజుల కాలమా…?

నిజానికి చంద్రబాబు అమరావతి కాన్సెప్ట్ ని తీసుకున్నపుడు కనీసం నాలుగు దశాబ్దాల కాలం పడుతుందని ముందే ఊహించారని అప్పటి ఆయన ప్రకటనల బట్టి అర్ధమైపోతోంది. 2050 వరకూ తమదే అధికారం అంటూ ఆయన తనదైన విజనరీ బయటపెట్టుకున్నారు. అంటే ఓపిక ఉన్నంతవరకూ తాను, తరువాత తనయుడు లోకేష్, ఇంకా దూరం వెళ్తే దేవాన్ష్ ఎక్కడా బ్రేక్ లేకుండా ముఖ్యమంత్రులుగా ఉంటామని అని కూడా చంద్రబాబు గట్టిగా భావించే అమరావతి వంటి పెద్ద యాగాన్ని చేయాలనుకున్నారు. ఇంతగా ఆలోచించిన చంద్రబాబు ఇక్కడే జగన్ ని పూర్తిగా మరచిపోయారు. ఆయన్ని చాలా చాలా తక్కువగా చూశారు, చేశారు, సీన్ కట్ చేస్తే అయిదేళ్ళ వ్యవధిలోనే జగన్ సీఎం అయి చంద్రబాబుని పడదోశారు. పైగా చంద్రబాబు తెలివిగా రైతులను ఇరికించిన క్లాజులే జగన్ అమరావతిని మూడు ముక్కలు చేయడానికి ఆయుధాలుగా మారాయి

Tags:    

Similar News