మోడీ సై అన్నా బాబు నై అనాల్సిందేనా ?

చంద్రబాబు పరిస్థితి ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఏంటి అన్నది చెప్పడం కంటే మునిసిపాలిటీల ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే చాలు అర్ధమైపోతుంది. ఏపీలో పల్లెల్లో మాత్రమే జగన్ మీద [more]

Update: 2021-03-30 11:00 GMT

చంద్రబాబు పరిస్థితి ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఏంటి అన్నది చెప్పడం కంటే మునిసిపాలిటీల ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే చాలు అర్ధమైపోతుంది. ఏపీలో పల్లెల్లో మాత్రమే జగన్ మీద మోజు ఉందని టీడీపీ భావించింది, కానీ పట్నాలకు పట్నాలు కూడా వైసీపీకి దాసోహం అవడం చూసి నాలిక్కర్చుకుంది. కానీ జరగాల్సిన రాజకీయ నష్టం భారీగా జరిగిపోయింది. అటు పల్లెలు, ఇటు పట్నాలు అన్నీ కలిపి జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలను కనుక బేరీజు వేసుకుంటే ఏపీలో పూర్తి రాజకీయ ముఖ చిత్రం ఆవిష్కృతమవుతుంది.

ధీమా ఉందా …?

ఈ మధ్య దాకా చంద్రబాబు పార్టీ నేతలతో ఒక్కటే మాట పదే పదే అంటూండేవారు. వచ్చే ఏడాదిలో జమిలి ఎన్నికలు వస్తాయి. మనదే అధికారమని. ఇపుడు ఆ మాట ఆయన అనగలరా అన్నది తమ్ముళ్లకే పెద్ద డౌట్. ఇరవై రెండు నెలలు గడచినా కూడా జగన్ మీద ఆదరణ జనాలకు అలాగే చెక్కు చెదరకుండా ఉంది, ఇప్పటికిపుడు జమిలి ఎన్నికలు పెడితే ఎవరు అధికారంలోకి వస్తారో ప్రత్యేకించి లగడపాటి లాంటి వారు సర్వే చేసి చెప్పాల్సిన పని లేనే లేదు. మరి రాజకీయ మేధావి అయిన చంద్రబాబుకు ఈ విషయం తెలియకుండా ఉంటుందా. అందుకే ఇక ఆయన నోట జమిలి మాట అసలు పలకలేరు అంటున్నారు.

ఆ మూడ్ ఉందా …?

ఇక తాజాగా జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే జమిలి వైపు బీజేపీ అడుగులు వేస్తుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ ఆశలు మాత్రం పూర్తిగా అణగారిపోలేదు అని చెప్పాలి. ఇక మరో వైపు చూస్తే కేంద్ర న్యాయ శాఖ ఆద్వర్యంలోని పార్లమెంట్ కమిటీ జమిలి ఎన్నికలు భేష్ అంటూ ఒక నివేదికను తయారు చేసి కేంద్రానికి ఇచ్చింది. మరి దాని మీద కేంద్రం ఇపుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. ఒక వేళ 2022లో జమిలి ఎన్నికలకు కానీ మోడీ సై అంటే అపుడు ఏపీలో చంద్రబాబు సంగతేంటని కూడా చర్చగా ఉంది.

ఎలాగైనా ఓకే ….

ఏపీలో వైసీపీ తీరు చూస్తే రేపు ఎన్నికలు పెట్టినా రెడే అంటోంది. ఎందుకంటే లోకల్ బాడీస్ ఫలితాలు ఆ ధీమాను ఇచ్చేశాయి. అలా కాదు మరో మూడేళ్ళు ఆగి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అన్నా కూడా తమ కార్యక్రమాలు పూర్తిగా అమలు చేసుకునేందుకు బోలెడంత సమయం వెసులుబాటు వైసీపీకి దొరుకుతాయి. అదే చంద్రబాబు విషయానికి వస్తే వచ్చే ఏడాది ఎన్నికలు అంటే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లే. ఇప్పటికే దిగనారిన పార్టీతో వైసీపీని మళ్లీ ఢీ కొట్టలేరు. అలా కాదు 2024 లో ఎన్నికలు అంటే అంతదాకా పార్టీని ముందుకు నడపడం ఎలా అన్నది కూడా బిగ్ టాస్క్. మొత్తానికి చూస్తే చంద్రబాబుకు కు గొప్ప చిక్కు వచ్చిపడింది అంటున్నారు.

Tags:    

Similar News