ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే..?

చంద్రబాబు సర్కార్ కొలువైన రోజుల్లో కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఉవ్వెత్తున లేచిన ఆ ఉద్యమాన్ని తన అపార అనుభవంతో [more]

Update: 2020-01-20 11:00 GMT

చంద్రబాబు సర్కార్ కొలువైన రోజుల్లో కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఉవ్వెత్తున లేచిన ఆ ఉద్యమాన్ని తన అపార అనుభవంతో ఐదేళ్ళు హ్యాండిల్ చేసి కాపు నేతలకు ఉద్యమకారులకు చంద్రబాబు చుక్కలు చూపించారు. నెలల తరబడి ఉద్యమ నేతల గృహ నిర్బంధాలు అరెస్ట్ లు లాఠీ చార్జీలు ఏ ఒక్కరు మరిచిపోలేదు. అలాగే గతంలో విద్యుత్ చార్జీల పెంపుకి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమాన్ని, ఉక్కుపాదంతో అణచివేశారు ఆయన.

సర్కారీ మార్క్…..

కాల్పుల వరకు దారితీసిన నాటి ఉద్యమంలో పలువురి ప్రాణాలు సైతం గాల్లోకి పోయాయి. ఇక రైతుల సమస్యలపై జరిగిన ఉద్యమం లోను కాల్దారి లో రైతులపై కాల్పులు జరిపించి సర్కారీ మార్క్ ఎలా ఉంటుందో చేసి చూపించేశారు ఆయన. ఇక ప్రత్యేక హోదా పేరు ఎత్తితే జైలుకే అంటూ ఏపీ కి జరిగిన అన్యాయాన్ని ఏ ఒక్కరు ప్రశ్నించకూడదు అనే రీతిలో సమర్ధవంతంగా అణచివేశారు చంద్రబాబు. ప్రభుత్వ అధినేతగా ఆయన గతంలో చేసిన ఈ ఘనకార్యాలు వర్తమానంలో చంద్రబాబును వెంటాడేస్తున్నాయి.

అదే తీరులో చెలరేగుతున్న …

అమరావతి లోని రాజధానిని వికేంద్రీకరించడానికే ససేమిరా అంటున్న చంద్రబాబు కి ఇప్పుడు పాత చరిత్ర గుర్తుకురాని పరిస్థితిని వైసిపి సర్కార్ కల్పించింది. గతంలో చంద్రబాబు ఉద్యమాలు అణచివేసిన తీరునే ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేసేస్తోంది. నేతల గృహ నిర్బంధం, అరెస్ట్ లు, లాఠీ చార్జీలు ర్యాలీలకు అనుమతుల నిరాకరణ ఇలా ఒకటేమిటి చంద్రబాబు అప్పుడు చేసినవన్నీ ఆయనకే రుచి చూపించడాన్ని తమ్ముళ్ళు సహించలేక సతమతం అవుతున్నారు.

నీతులు మాత్రం….

విపక్షంలో వున్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య హక్కులు గురించి చంద్రబాబు చెప్పినన్ని నీతులు ఏ ఒక్క నేత చెప్పని రికార్డ్ కూడా వుంది. అయితే ఎప్పుడో చేసిన తన చర్యలన్నీ ఇంత తొందరగా తనకే చుట్టుకోవడాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నారు. అప్పుడు మీరు చేస్తే ఒప్పు మేము ఇప్పుడు చేస్తే తప్పా అంటూ వైసిపి నేతలు ఆడిపోసుకోవడం దానిపై సరైన కౌంటర్లు ఇవ్వలేక ఇబ్బంది పడటం తమ్ముళ్ల వంతు అయ్యింది. తమ ఫ్లాష్ బ్యాక్ తమకే ఇలా రివర్స్ కొడుతుందని ఊహించని పసుపు పార్టీ కి గడ్డుకాలం నుంచి ఎప్పుడు బయటపడుతుందో మరి.

Tags:    

Similar News