హస్తినకు ఇక బయలుదేరొచ్చా… లైన్ క్లియర్ అయిందా?

ఆ రెండక్షరాల పేరు వింటేనే చంద్రబాబు గడగడ లాడి పోతున్నారు. పది నెలల ముందు విపరీతంగా తిట్టిన నోరే నేడు పొగడ్తలతో ముంచెత్తుండటం విశేషం. టీడీపీ అధినేత [more]

Update: 2020-03-23 09:30 GMT

ఆ రెండక్షరాల పేరు వింటేనే చంద్రబాబు గడగడ లాడి పోతున్నారు. పది నెలల ముందు విపరీతంగా తిట్టిన నోరే నేడు పొగడ్తలతో ముంచెత్తుండటం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం జోలికి వెళ్లడం లేదు. అది భయం కావచ్చు. భక్తి కావచ్చు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోననూ చంద్రబాబు రాజీ పడినట్లుంది. ప్రస్తుతానికి చంద్రబాబు జాతీయ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. కేవలం రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఏపీలో తొలుత పట్టు సంపాదించుకునేందుకే ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏడాది పైగానే అవుతుంది.

పది నెలలకు ముందు….

పది నెలల ముందు మాత్రం మోదీ శత్రువు. ఎన్నికల ప్రచారంలో మోదీ ముందు తర్వాత జగన్ అన్నట్లుగా సాగింది చంద్రబాబు ప్రచారం. రాష్ట్రానికి అన్యాయం చేశారని మోదీపై చిందులు తొక్కారు. ప్రత్యేక హోదా ఇవ్వలేందంటూ ఢిల్లీకి వెళ్లి మళ్లీ ధర్నా చేసి వచ్చారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల కమిషన్ కు అన్ని విపక్ష పార్టీలతో కలసి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

ఇప్పుడన్నీ పొగడ్తలే…..

కట్ చేస్తే గత పది నెలల నుంచి మోదీ మాటే ఎత్తడం లేదు. ఒకవేళ ఆ మాట ఎత్తినా పొగడ్తలే ఉంటున్నాయి. కరోనా విషయంలో మోదీ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను చంద్రబాబు ప్రశంసించారు. మోదీ చెప్పినట్లే అందరూ నడుచుకోవాలని కూడా ప్రజలకు విజ్ఞప్తులు చేశారు. ఇప్పుడిప్పుడే కొంత బీజేపీతో సఖ్యత కుదురుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్రం స్థాయిలో సుజనా చౌదరి, రాష్ట్ర స్థాయిలో కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు చంద్రబాబు పట్ల బీజేపీకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు.

త్వరలో హస్తినకు…..

మరో నాలుగేళ్ల పాటు జగన్ పరిపాలన ఉంటుంది. ఈ నాలుగేళ్లు జగన్ ను తట్టుకోవాలంటే మోదీ అండ చంద్రబాబుకు అవసరం. అందుకోసం హస్తినలో ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు హస్తిన వెళ్లి ఏడాది గడుస్తుంది. ఎన్నికలకు ముందు వెళ్లి వచ్చిన ఆయన ఫలితాల తర్వాత ఇప్పటి వరకూ ఢిల్లీ గడప తొక్కలేదు. పరిస్థితులు బీజేపీతో సానుకూలంగా మారుతుండటంతో త్వరలో ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మోదీ, అమిత్ షాలతో భేటీ కాకున్నా ముఖ్యనేతలను కలసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News