ట్రోల్ తో క్లీన్ బౌల్డ్

పెదవి దాటని మాటకు ప్రభువు నీవు . పెదవి దాటిన మాటకు బానిసవు నీవు అని పెద్దలు అంటూ వుంటారు. ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా [more]

Update: 2019-09-30 06:30 GMT

పెదవి దాటని మాటకు ప్రభువు నీవు . పెదవి దాటిన మాటకు బానిసవు నీవు అని పెద్దలు అంటూ వుంటారు. ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మాట నోరు దాటితే ఎలాంటి ఇబ్బందులు ప్రతిఫలిస్తాయో చెప్పక చెబుతుంది. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వారు తలుపు కొడతారు జాగ్రత్త. ఐదు వేలరూపాయలకు గోెనె సంచీలు ఎత్తుతారా ? అంటూ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ట్రోల్ అవుతున్నాయి. బాబు పై వైసిపి సోషల్ మీడియా టీం సెటైర్లపై సెటైర్లు పేలుస్తుంది. ఇక కార్టూన్లకు అయితే కొదవే లేదు. గ్యాస్ సిలిండర్ తెచ్చే వారితో, పాలుపోసే వారితో, కూరగాయలు తెచ్చే వారితో గృహిణులు మావారు ఇంట్లో వున్నప్పుడు రండి అంటూ జోకులు విసురుతున్నారు. ఇదంతా గ్రామ వాలంటీర్ల నియామకం విషయంలో కావడం గమనార్హం.

వారు విధుల్లోకి చేరకుండానే ….

గ్రామ వాలంటీర్లు ఇంకా విధుల్లో చేరకుండానే చంద్రబాబు ఈవిధంగా వ్యాఖ్యానించడం కూడా పెనుదుమారామే రేపుతోంది. కొత్త వ్యవస్థ వచ్చి వారు విధులు నిర్వర్తించే అంశంలో తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపడం సబబుగా ఉంటుంది కానీ తొందరపడి బాధ్యతాయుత స్థానాల్లో వున్నవారు ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. లక్షలాదిమంది నిరుద్యోగయువతకు అవకాశం ఒకేసారి దక్కడంతో టిడిపి వర్గాల సంగతి ఎలా వున్నా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈవిధంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు నెటిజెన్స్. ఇది యువతను అవమానించడమేనని బస్తాలు ఎత్తుతారా అంటూ తమ విధులను పలుచన చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పసుపు , కుంకుమ పేరుతో ఎన్నికల ముందు ఉచితంగా డబ్బులు పంచడం లేదని ఏ పని చేయకుండా ఇవ్వడం లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు.

గతంలోనూ ఇలాగే …

గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇలాగే నోరు జారడం వివాదాస్పదం అయ్యింది. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటున్నారా ? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యల్లో ఆయన అర్ధం పరమార్ధం వేరున్నప్పటికీ నెగిటివ్ సెన్స్ బాగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. ఇటీవల ఎన్నికల్లో ఎస్సి సామాజిక వర్గం గంపగుత్తగా తమ ఓట్లను వైసిపి ఖాతాలో వేయడానికి చంద్రబాబు నోరు తెచ్చిన పాట్లే అని విశ్లేషకులు ఇప్పటికి ప్రస్తావిస్తారు. అదేవిధంగా వైసిపి కి ఓట్లు వేస్తే మీ పిల్లల్ని ఎత్తుకు పోయే ప్రమాదం ఉందని, దొంగలు ఖునీకోరులు, కబ్జా దారులంటూ ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యర్థులపై విరుచుకుపడి రాజకీయాలను వీధి కుళాయి పోరాటాలకు దిగజార్చి దెబ్బతిన్నారు. తాజాగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో లోపాలను ప్రస్తావించడం మాని గృహిణులు, గ్రామవాలంటీర్ల కు ఎంపికైన వారి మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు టిడిపికి మైలేజ్ సంగతి దేవుడెరుగు మైనస్ లో పడేలా చేశాయని సోషల్ మీడియా తేల్చేసింది.

Tags:    

Similar News