ఎన్టీఆర్‌తో ఘనంగా… బాబుతో భూస్థాపితం ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు అధికారంలోకి వచ్చి.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేసిన టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో అధికారంలోకి కూడా [more]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు అధికారంలోకి వచ్చి.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేసిన టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో అధికారంలోకి కూడా [more]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు అధికారంలోకి వచ్చి.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేసిన టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో అధికారంలోకి కూడా వచ్చింది. అయితే విడిపోయిన.. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో మాత్రం తొలినాళ్లలో బాగానే ఉన్నా.. తర్వాత తర్వాత.. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. గెలిచిన నాయకుల అధికార దాహం… పార్టీ చీఫ్‌గా ఉన్న ఎల్ రమణపై నమ్మకం లేకపోవడం.. కీలక నేతలకు ఇస్తానన్న హామీ మేరకు చంద్రబాబు పదవులు ఇవ్వక పోవడం అధికార పార్టీ టీఆర్ ఎస్ దూకుడు ఎక్కువగా ఉన్నప్పటికీ.. దానిని నిలువరించకపోవడం.. సంస్థాగతంగా ఏర్పడిన లోపాలను సరిదిద్దుకోని కారణంగా టీడీపీ ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిపోయింది.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని….
ఇక, 2014 ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ. 2018 ఎన్నికల్లో మాత్రం పోయి పోయి.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని తెలంగాణ టీడీపీ నేతలు సహించలేక పోయారు. ఆ మాటకు వస్తే ప్రతి తెలుగుదేశం వీరాభిమానికి కూడా ఈ విషయం నచ్చ లేదు. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో అదే పార్టీతో పొత్తును సొంత పార్టీ నేతలే సహించలేకపోయారు. దీంతో గెలుస్తుందని భావించిన నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓటమి చవి చూసింది. మరీముఖ్యంగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి హరికృష్ణ కుమార్తె.. సుహాసినిని రంగంలొకి దింపినా.. ఆమెను సైతం గెలిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది. పైగా అప్పటి వరకు హరికృష్ణ ఫ్యామిలీని పూర్తిగా పక్కన పెట్టిన చంద్రబాబు… ఆయన మరణాంతరం ఆయన కుటుంబాన్ని బయటకు లాగి సానుభూతి పొందే ప్రయత్నం చేశారన్న విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
మోత్కుపల్లి వంటి వాళ్లు ముందే చెప్పినా?
ఈ క్రమంలో దీనికి ముందు.. సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు వంటివారు.. పార్టీ దెబ్బతినే పరిస్థితి ఉందని.. చంద్రబాబు కళ్లు తెరవాలని.. లేదా టీఆ ర్ఎస్‌లో విలీనం చేసి.. గౌరవంగా తప్పుకోవాలని సూచించారు. అయితే.. ఆయనపై ఆగ్రహించిన అధిష్టానం.. ఆయనను పక్కకు పెట్టిందే తప్ప.. తప్పులు సరిచేసుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. దీంతో ఇతర నేతలు 'విషయం' పసిగట్టినా.. నేరుగా చెప్పలేదు. మరీ ముఖ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మారిపోయినప్పుడైనా.. చంద్రబాబు కళ్లు తెరిచి ఉంటే బాగుండేదనే ఆరోపణలు వచ్చాయి. ఇక, పార్టీ ఇక్కడ పుంజుకునేందుకు నందమూరి వంశానికి చెందిన వారు రంగంలోకి దిగాలనే సూచనలను సైతం చంద్రబాబు పక్కన పెట్టారు.
వారికి దిశానిర్దేశం కూడా….
ఫలితంగా ఎల్. రమణ కొనసాగింపు.. ఇతర సీనియర్లతోనే పార్టీని నెట్టుకొచ్చారు. ఇక, గెలిచిన వారికి కూడా చంద్రబాబు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. వారి సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. తెలంగాణలో సమస్యలు పట్టించుకుని.. వాటిపై ప్రభుత్వానికి సూచనలు సైతం చేయలేదు. ఇలా.. కర్ణుడి చావుకు కారణాలు మాదిరిగా .. టిడీపీ తెలంగాణలో అంతరించిపోయేందుకు అనేక కారణాలు ఎదురవుతున్నాయని కొందరు సీనియర్లు చెప్పినా.. చంద్రబాబు లైట్ తీసుకున్నారు. ఇక, ఇప్పుడు.. పూర్తిగా పార్టీ ప్రమాదంలో పడిపోయింది. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార గూటికి చేరిపోయారు. దీనిని బట్టి భవిష్యత్తులో టీడీపీ ఇక, తెలంగాణలో లేనట్టేనని అంటున్నారు పరిశీలకులు.