వంశీతో పాటు మరో నలుగురట

ఏపీలో మ‌ళ్లీ జంపింగుల ప‌ర్వ ప్రారంభ‌మైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న నాయ‌కులు, చంద్రబాబును ఆహా.. ఓహో.. అంటూ ఆకాశానికి ఎత్తేసిన నాయ‌కులు ఇప్పుడు ఆయ‌న‌కు [more]

Update: 2019-10-27 03:30 GMT

ఏపీలో మ‌ళ్లీ జంపింగుల ప‌ర్వ ప్రారంభ‌మైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న నాయ‌కులు, చంద్రబాబును ఆహా.. ఓహో.. అంటూ ఆకాశానికి ఎత్తేసిన నాయ‌కులు ఇప్పుడు ఆయ‌న‌కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే, గ‌తంలోనూ ఇలానే విప‌క్షంలో ఉన్న నాయ‌కులు అధికార ప‌క్షంలోకి జంప్ చేసిన ప‌రిస్థితి ఉంది. అయితే, అప్ప‌ట్లో అంతా అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు, ప‌ద‌వుల‌పై వ్యామోహంతోనే నాయ‌కులు జంప్ చేశారు. కానీ, ఇప్పుడు స్వ‌చ్ఛందంగా నాయ‌కులు జంప్ చేసేందుకు రెడీ కావ‌డం చాలా ఆస‌క్తిగా మారింది. ఇందుకు టీడీపీలో ఉంటే భ‌విష్య‌త్తు లేద‌ని న‌మ్మ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం.

దీపావళి తర్వాత..?

ఈ క్ర‌మంలోనే విప‌క్షంలో ఉన్న టీడీపీ నుంచి నాయ‌కులు వ‌రుస పెట్టి పార్టీ మారిపోయేందుకు రెడీ అయ్యా రు. ఈ క్ర‌మంలోనే తాజాగా కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ త‌న దారిని సెట్ చేసుకున్నారు. దీపావ‌ళి వెళ్లాక ఆయ‌న పార్టీ మార్పున‌కు అన్నీ సంసిద్ధం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఈయ‌న బాట‌లో ఎంత‌మంది ఉన్నారు? చ‌ంద్ర‌బాబుకు ఎంత మంది జ‌ల్ల కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నా ర‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప‌రిస్థితిని చూస్తే.. ప్ర‌తిప‌క్షం పుంజుకోక‌పోగా.. పాత బాట‌లోనే న‌డుస్తోంది. నాయ‌కులను ఏక‌తాటిపైకి తెచ్చి, పార్టీని బ‌లోపేతం చేసేందుకు చంద్ర‌బాబు కృషి చేయ‌డం లేదు.

లోకేష్ నాయకత్వంలో…..

దీంతో పార్టీలో ఉన్నా లేకున్నా ఒక‌టే అనే ధోర‌ణి పెరిగిపోయింది. ఇక లోకేష్ నాయ‌క‌త్వంలో పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌న్న న‌మ్మ‌కాలు ఎవ్వ‌రికి లేవు. ఇవ‌న్నీ వంశీ పార్టీ మారిపోయేందుకు కార‌ణ‌మైంది. అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో టీడీపీలో చ‌క్రం తిప్పిన నాయ‌కులే ఇప్పుడు పార్టీ స‌హా వ్య‌క్తి గ‌తంగా వారు ఓడిపోయ‌న త‌ర్వాత కూడా చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో ఈ ప‌రిణామాన్ని జీర్ణించుకోలేక పోతున్న నాయ‌కులు.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఈ వ‌రుస‌లో వంశీ ముందు వ‌రుస‌లో ఉండ‌గా ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తి, అద్దంకి ఎమ్మెల్యే మాజీ వైసీపీ నేత గొట్టిపాటి ర‌వి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, వీరిలో ఎవ‌రు వైసీపీలోకి వెళ్లినా.. మ‌రొక‌రు మౌనంగా ఉండిపోతారు.

ఆ ముగ్గురు కూడా….

వీరి మ‌ధ్య ద‌శాబ్దాలుగా ఉన్న వైరం కారణంగా ఒకే పార్టీలో క‌లిసి ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఈ ఇద్ద‌రిలో ఒకరు ఖాయంగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే ప్ర‌చారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ బ‌ల‌రాం వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు భోగ‌ట్టా. అదేవిధంగా విశాఖ‌లోనూ ముగ్గ‌ురు ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు హ్యాండిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. విశాఖ తూర్పు వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు.. త‌ప్ప‌.. వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్, గ‌ణ‌బాబు, గంటా శ్రీనివాస‌రావు వైసీపీ వైపు చూస్తున్నారు. గంటా చెప్పిన‌ట్టు న‌డుచుకునే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో వంశీ బాట‌లో న‌లుగురు నుంచి ఐదుగురు వ‌ర‌కు పార్టీ మారిపోయే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. అసెంబ్లీలోనూ టీడీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా కోల్పోయే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News