ఆ ట్యాగ్ లైన్ వాడుకుందామనుకున్నా….?

ఆయ‌న వ‌య‌సు 80 ప్లస్‌. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఆయ‌న సొంతం. వ‌య‌సు పెద్దదే అయినా.. మ‌న‌సు మాత్రం ఉరుకులు ప‌రుగులు పెడుతున్న నాయ‌కుడుగా ఆయ‌న రాష్ట్రంలో [more]

Update: 2021-04-01 13:30 GMT

ఆయ‌న వ‌య‌సు 80 ప్లస్‌. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఆయ‌న సొంతం. వ‌య‌సు పెద్దదే అయినా.. మ‌న‌సు మాత్రం ఉరుకులు ప‌రుగులు పెడుతున్న నాయ‌కుడుగా ఆయ‌న రాష్ట్రంలో గుర్తింపు పొందారు. ఆయ‌నే మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ జోగ‌య్య. రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న‌దైన పాత్ర పోషించిన ఆయ‌న నిజానికి చెప్పాలంటే.. వృద్ధ నేత‌. ప్రత్యక్ష రాజ‌కీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌కు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. ఇక‌, పార్టీ ఓట‌మి త‌ర్వాత మౌనం పాటించారు. అయితే.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో ట‌చ్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం వృద్ధాప్య స‌మ‌స్యల‌తో ఇబ్బంది ప‌డుతున్న చేగొండి హ‌రిరామ జోగ‌య్య. ఆ స‌మ‌స్య ‌ల‌ను కూడా ప‌క్కన పెట్టి.. కాపుల కోసం ఉద్యమిస్తానంటూ ప్రక‌ట‌న గుప్పించారు.

కాపులకు అండగా ఉంటానంటూ….

అది కూడా కొన్నాళ్ల కింద‌ట కాపు ఉద్యమ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగ‌డ ప‌ద్మనాభం.. కాపు ఉద్యమానికి గుడ్ బై చెప్పిన స‌మ‌యంలో చేగొండి హ‌రిరామ జోగ‌య్య రంగంలోకి దిగారు. తాను కాపుల‌కు అండ‌గా నిలుస్తాన‌ని. వారి హ‌క్కులు ప‌రిర‌క్షిస్తాన‌ని కూడా ఆయ‌న వెల్లడించారు. 'కాపు సంక్షేమ సేన‌' పేరుతో ఆయ‌న ఉద్యమ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రక‌టించారు. కాపు యువ‌త అంద‌రూ వ‌చ్చి చేరాల‌ని కూడా పిలుపునిచ్చారు. దీనికి పార్టీల మ‌ద్దతు కూడా కూడ‌గడ‌తాన‌ని ఆయ‌న ప్రక‌టించారు. అయితే.. ఇది జ‌రిగి మూడు మాసాలైనా కూడా ఇప్పటి వ‌ర‌కు జోగ‌య్య దీనిని ముందుకు న‌డిపించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

కాపు సంక్షేమ సేనతో…

ప్రధానంగా కాపులు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న రిజ‌ర్వేష‌న్ల కోసం త‌న పోరాటం కొన‌సాగుతుంద‌ని చేగొండి హ‌రిరామ జోగ‌య్య వెల్లడించారు. కాపు సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ సౌకర్యం కలిగించేంత వరకూ ఉద్యమాల ద్వారా జగన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కాపు సంక్షేమ సేనను స్థాపించామన్నారు. బీసీలకు ఎటువంటి నష్టం లేకుండా కాపుల్ని బీసీలుగా ప్రకటించడం లేని పక్షంలో ఓసీలలో 10 శాతం ఈబీసీ కోటాలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పించాలని చేగొండి హ‌రిరామ జోగ‌య్య అప్పట్లో డిమాండ్‌ చేశారు. కాపు సంక్షేమ సేనకు ఏ పార్టీకి సంబంధంలేదని ఒక సామాజిక వర్గానికి చెందినదని కాదన్నారు. అయితే.. ఇప్పటి వ‌ర‌కు జోగ‌య్య ఈ విష‌యంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేక పోయారు.

సంచనాల కోసమేనా?

అయితే.. పొలిటిక‌ల్ స‌ర్కిళ్లలోచేగొండి హ‌రిరామ జోగ‌య్యపై ఒక ప్రచారం ఉంది. ఆయ‌న ఎంత సేపూ.. సంచ‌ల‌నాల కోసం పాకులాడ‌తార‌ని.. వారు అంటున్నారు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న ఎంపీగా గెలిచారని.. త‌ర్వాత చిరంజీవి పార్టీ పెట్టగానే వైఎస్‌ను గట్టిగా టార్గెట్ చేస్తూ ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయార‌ని.. అక్కడ కూడా స్థిమితంగా రాజ‌కీయాలు చేయ‌లేద‌ని అంటున్నారు. త‌ర్వాత వైసీపీలో చేరి.. 2014లో ఈ పార్టీకి కూడా రిజైన్ చేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌నసేన‌కు ద‌గ్గరైన చేగొండి హ‌రిరామ జోగ‌య్య . ఎన్నికల త‌ర్వాత మ‌ళ్లీ ప‌వ‌న్‌ను క‌లిశారు. ఇలా.. ఒక పార్టీలో ఆయ‌న ఉండి.. గుర్తింపు పొందింది ఏమీ లేద‌ని.. ఆయ‌న కేవ‌లం సంచ‌ల‌నాల కోసమే రాజ‌కీయాలు చేసే నాయ‌కుడిగా ఉన్నార‌ని విమ‌ర్శలు ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు కూడా ఆయ‌న ఈ సంచ‌ల‌నాల కోస‌మే కాపుల ట్యాగ్ వాడుకుని ఉంటార‌ని చెప్పేవారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News