Congress : నవ్విపోతారు నాయకా… వైఎస్ లేకుంటే?
ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి. జనం నవ్విపోతారన్న సిగ్గు కూడా లేదు. పైగా సీనియర్ నేత అని చెప్పుకుని తిరుగుతుంటారు. 2004లో వైఎస్ రాజశేఖర్ [more]
ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి. జనం నవ్విపోతారన్న సిగ్గు కూడా లేదు. పైగా సీనియర్ నేత అని చెప్పుకుని తిరుగుతుంటారు. 2004లో వైఎస్ రాజశేఖర్ [more]
ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి. జనం నవ్విపోతారన్న సిగ్గు కూడా లేదు. పైగా సీనియర్ నేత అని చెప్పుకుని తిరుగుతుంటారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద తప్పు చేసిందని చింతామోహన్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలే అభ్యంతరం తెలుపుతున్నారు. చింతా మోహన్ కు తెలిసే మాట్లాడుతున్నారా? లేక కాంగ్రెస్ కు మరింత నష్టం కలిగించాలని ఆ వాఖ్యలు చేసినట్లుంది.
ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో….
ఒకవైపు బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కమలమ్మను పోటీకి దింపారు. ఈ పరిస్థితుల్లో కడప జిల్లాలో ఎన్నిక జరుగుతుందని, అది వైఎస్ ఇలాకా అని తెలిసీ స్పృహ లేకుండా చింతా మోహన్ మాట్లాడినట్లుంది. బద్వేలులో కాంగ్రెస్ కు పడే ఒకటి, అరా ఓట్లు కూడా ఇక పడే అవకాశం లేదు. వైఎస్ వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని చెప్పి మరింత డ్యామేజీ చేశారు. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే నేత లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
పదేళ్ల పాటు అధికారానికి దూరంగా….
1989 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన కాంగ్రెస్ కు ఆ తర్వాత పదేళ్లు గెలుపు దక్కలేదు. 1994, 1999 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మా ఉన్న నేతగా 2003లో మండుటెండలో 1487 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఫలితమే కాంగ్రెస్ కు 2004లో విజయం దక్కింది. వైఎస్ కు అధిష్టానం ఊరికే సీఎం పదవి ఇవ్వలేదన్న విషయాన్ని చింతా మోహన్ గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే నాడు సీఎల్పీ నేతగా ఆయనను ఎన్నుకోవడం జరిగిందన్నది మర్చి పోవద్దు.
రెండుసార్లు గెలిచింది ఎవరివల్ల?
వైఎస్ సంక్షేమ పథకాల వల్లనే చింతా మోహన్ 2004, 2009లో తిరుపతి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో తిరుపతిలో ఎందుకు గెలవలేకపోతున్నారు. వైఎస్ చరిష్మా లేకుండా వ్యక్తిగత ఇమేజో, కాంగ్రెస్ పార్టీకి ఉన్న జనాదరణ వల్లనో గెలవాలి కదా ? అంత పట్టున్న నేత అయితే కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకోవాలి కదా. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసినందునే ఆ పార్టీకి ఈ గతి పట్టింది. విభజన చేయకుంటే జగన్ పార్టీ పెట్టి ఉన్నా కొద్దో గొప్పో ఓటు బ్యాంకు మిగిలేది. ఆ విషయాన్ని చింతామోహన్ వంటి సీనియర్ నేతలు గుర్తుంచుకుంటే మంచిది. ఒక వ్యాఖ్యను చేసే ముందు కాంగ్రెస్ ను ముంచిందెవరో? తేల్చిందెవరో? తెలుసుకుంటే బాగుంటుంది.