కేసీఆర్ అన్నది వీరిద్దరి గురించేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నది సమావేశంలో పాల్గొన్న నేతలకు [more]

Update: 2021-02-09 00:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నది సమావేశంలో పాల్గొన్న నేతలకు అర్థం కాలేదు. కానీ కేసీఆర్ ఇద్దరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు టీఆర్ఎస్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు అంత సులువు కాదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వైఎస్ షర్మిల, రేవంత్ రెడ్డిని ఉద్దేశించినవేనంటున్నారు.

కొత్త పార్టీ పెడితే….?

ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు అంత సులభం కాదని అన్నారు. దానికి ఎంతో శ్రమ చేయాల్సి ఉంటుందన్నారు. గతలో నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్ పార్టీలు పెట్టి ఏమయ్యారని ప్రశ్నించారు. నాలుగు రోజుల్లో కొత్తగా పార్టీ పెట్టేవారు తోకముడిచి వెళతారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో వస్తున్న కొత్త పార్టీలకు భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ తెలిపారు.

షర్మిల కొత్త పార్టీ అంటూ…..

అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి చేసినవేనని అంటున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జగన్ తో విభేదించిన షర్మిల తెలంగాణలో కొత్త ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని, దీనివెనక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెలంగాణకు చెందిన కీలక నేత ఉన్నారన్న వదంతులూ విన్పించాయి. ఈరోజు షర్మిల ఆత్మీయ సమావేశం కూడా పెడుతున్నారు. దీనిని వైసీపీ పార్టీ నుంచి కూడా ఎలాంటి అనుకూల, వ్యతిరేక ప్రకటనలు రాలేదు. ఈరోజు జరిగే సమావేశంలో షర్మిల పార్టీపై స్పష్టత వచ్చే అవకాశముంది.

రేవంత్ పార్టీ అంటూ….

ఇక మరోవైపు రేవంత్ రెడ్డి కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగతుంది. కాంగ్రెస్ తెలంగాణలో బలహీనమయిపోవడం, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. రెడ్డి సామాజికవర్గాన్ని ఏకం చేసే నేతగా, కేసీఆర్ ను బలంగా ఎదుర్కొనే లీడర్ గా రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతారన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వీరిద్దరిని ఉద్దేశించినవేనని పార్టీలో చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News