ఎన్టీఆర్ ని కూడా వాడేసుకుంటున్నారా ?

తెలివి అంటే అదే మరి. రాజకీయాలు ఎలా చేయాలో కేసీఆర్ ని చూసే నేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అక్షరాభ్యాసం చేసిన కేసీఆర్ తెలుగుదేశం పార్టీ [more]

Update: 2020-09-11 11:00 GMT

తెలివి అంటే అదే మరి. రాజకీయాలు ఎలా చేయాలో కేసీఆర్ ని చూసే నేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అక్షరాభ్యాసం చేసిన కేసీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అందులో చేరారు. ఆ తరువాత ఎన్టీఆర్ చలువతో ఎమ్మెల్యేగా పలుమార్లు నెగ్గారు. మంత్రి కావాలన్న ఆశను చంద్రబాబు ద్వారా నెరవేర్చుకున్నారు. అయితే టీడీపీలో ఉంటే కధ ఇంతేనని గ్రహించి బయటకు వచ్చి టీయారెస్ పార్టీని ఏర్పాటు చేయడం, దశాబ్దలా ప్రజల కోరిక తెలంగాణా రాష్ట్రాన్ని సాకారం చేయడం ద్వారా కేసీఆర్ టీడీపీ ద్వారా వచ్చిన నాయకులందరి కంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు.

కాంగ్రెస్ అలా చెక్….

ఇక పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగానే ఆయన కాళ్ల కింద మంటలు పెట్టి ఆయన ఆ పదవి నుంచి దిగిపోయాక ఎన్నో రకాలుగా అవమానాలు చేశారు. ఆయన చనిపోయాక సైతం ఢిల్లీలో చోటు లేదని తేల్చిచెప్పేసి హైదరాబాద్ కి భౌతికకాయాన్ని పంపించేశారు. అలా కాంగ్రెస్ కంటికి కనిపించని పీవీని ఇపుడు కేసీఆర్ అక్కున చేర్చుకుని శత జయంతి ఉత్సవాలను గొప్పగా చేస్తున్నారు. ఆయనకు భారత రత్న కోసం కూడా గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణా బిడ్డ అంటూ తమ పీవీని పార్టీలోకి తెచ్చేశారు. ఇపుడు దీనిమీద కాంగ్రెస్ కి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది.

ఎన్టీయార్ తోనూ…

ఇదిలా ఉంటే ఇపుడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీయార్ ని కూడా టీఆర్ఎస్ లోకి తెచ్చేసే భారీ స్కెచ్ కి కేసీఆర్ స్కెచ్ గీసారని అంటున్నారు. ఎన్టీయార్ ఏపీకి చెందిన కృష్ణా జిల్లా వాసి. అయితే ఆయన ఏడున్నర ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్ కి తెలంగాణాలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్టీఆర్ వీరాభిమాని. తన కుమారుడికి కూడా ఆయన పేరు పెట్టుకున్నారు. టీడీపీకి ఉన్న క్యాడర్ ఎటూ మళ్ళకుండా ఉందంటే దానికి ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమే కారణం. వారిని తనవైపు తిప్పుకోవడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ కూడా మావాడేనని చెబుతూ అల్లుడు, 14 ఏళ్ళ పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేయలేని పనిని కేసీఆర్ చేసి చూపిస్తున్నారు.

పాఠ్యాంశంగా…?

ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం. ఒక సామాన్యుడు అసమాన్యమైన ఎత్తుకు ఎదగడం విశేషమైతే, అది కూడా తన జీవిత కాలంలో రెండు అతి ముఖ్యమైన రంగాల్లో శిఖరాయమానంగా వెలగడం అంటే అది నిజంగా గొప్ప విషయమే. దీనికంతటికీ ఎన్టీఆర్ పట్టుదల కారణం. ముమ్మారు సీఎంగా ఉమ్మడి ఏపీకి పనిచేసిన ఎన్టీఆర్ జీవితాన్ని పాఠపుస్తకంగా కేసీఆర్ సర్కార్ తీసుకొస్తోంది. పదవతరగతి విద్యార్ధులకు సాంఘిక శాస్త్రంలో పాఠంగా ఎన్టీఆర్ ఉంటారన్నమాట. దీనివల్ల తెలంగాణాతో టీడీపీకి పూర్తిగా సంబంధాలు తెంపేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నట్లైంది. అంతే కాదు, రేపటి రోజున పార్టీ తిరిగి లేవకుండా మిగిలి ఉన్న క్యాడర్ని కూడా టీఆర్ఎస్ వైపుగా నడిపించే ఎత్తుగడ ఇదని అంటున్నారు. రాజకీయం ఎలా ఉన్నా ఒక పీవీని, ఒక ఎన్టీఆర్ని గౌరవించడం ద్వారా కేసీఆర్ చాలా మంచి పని చేశారని అంతా మెచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News