జంపింగులతో వైసీపీ సాధించిందేంటి…?

వైసీపీలోకి టీడీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు పార్టీకి ఏమేర‌కు ప్లస్ అవుతున్నారు ? వైసీపీ వ్యూహానికి త‌గిన విధంగా వ్యవ‌హ‌రిస్తున్నారా? అస‌లు వీరి విష‌యంలో [more]

Update: 2021-02-04 08:00 GMT

వైసీపీలోకి టీడీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు పార్టీకి ఏమేర‌కు ప్లస్ అవుతున్నారు ? వైసీపీ వ్యూహానికి త‌గిన విధంగా వ్యవ‌హ‌రిస్తున్నారా? అస‌లు వీరి విష‌యంలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నల‌కు స‌మాధానం ల‌భించ‌డం లేదు. టీడీపీ త‌ర‌ఫున గెలిచిన వారిలో న‌లుగురిని ప్రత్యక్షంగా వైసీపీకి మ‌ద్దతు దారులుగా మార్చడంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. ఫ‌లితంగా అసెంబ్లీలో టీడీపీ వాయిస్‌ను త‌గ్గించేందుకు ప్రయ‌త్నించినట్టు అయింది. కానీ, అదే స‌మ‌యంలో సొంత పార్టీలో మాత్రం కుమ్ములాట‌లు పెరిగిపోయాయి.

వంశీ దరిచేరినా…..

ముఖ్యంగా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌ల మ‌ధ్య అగ్గి రాజుకుంటూనే ఉంది. కృష్ణా జిల్లా గ‌న్నవరంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన వంశీ.. వైసీపీకి మ‌ద్దతుదారుగా మారారు. కానీ, ఇక్కడ వైసీపీ నేత‌ల దూకుడుతో ఆయ‌న త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. వైసీపీ నుంచి వంశీకి గ‌త రెండు ఎన్నిక‌ల్లో ప్రత్యర్థులుగా ఉన్న దుట్టా రామ‌చంద్రరావు, యార్లగ‌డ్డ వెంక‌ట్రావు ఇద్దరూ వంశీని అణ‌గ‌దొక్కేందుకు చూస్తున్నారు. పార్టీ మారినా వంశీకి ఏ మాత్రం ప్రశాంత‌త లేదు. దీంతో పార్టీ మారి త‌ప్పు చేశానా ? అనే ఆలోచ‌న‌లో వంశీ ఉన్నార‌న్నది నిజం.

కొత్తగా పార్టీకి ప్రయోజనం…..

ఇక‌, ప్రకాశం జిల్లా చీరాల‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఏకంగా ఆమంచి కృష్ణమోహ‌న్‌తో ఈ అంటే.. డీ అనే రేంజ్‌లో క‌ర‌ణం బ‌ల‌రాం త‌ల‌ప‌డుతున్నారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్‌లో సైలెంట్‌గానే ఉన్నా.. ఇక్కడ నుంచి గెలిచిన మ‌ద్దాలి గిరి దూకుడుతో వైసీపీ నేత‌లు సైలెంట్ అయ్యారు. పైగా… టీడీపీ నుంచి వ‌చ్చిన వారివ‌ల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజ‌నం క‌నిపించ‌డం లేద‌ని వైసీపీలో సీనియ‌ర్లు చెబుతున్నారు. వివాదాలు త‌ప్ప.. మాకు కొత్తగా వ‌చ్చింది ఏమీ లేదు.. అని నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క గెలిచిన నాయ‌కుల‌తోనే కాదు ఓడిన వారిని కూడా పార్టీలోకి తీసుకున్నారు.

గ్రూపుల గోల ఎక్కువై….

తోట త్రిమూర్తులు, శిద్దా రాఘ‌వ‌రావు వంటివారు దీనికి ఉదాహ‌ర‌ణ‌. వీరివ‌ల్ల కూడా పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించడం లేదు. వీరిలో శిద్ధా సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటున్నా తోట త్రిమూర్తుల‌కు అమ‌లాపురం పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇచ్చినా ఉప‌యోగం లేదు స‌రిక‌దా ? ఆయ‌న వ‌చ్చాక పార్టీలో ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపుల గోల ఎక్కువైంది. మ‌రి పార్టీలోకి వీరిని తీసుకుని ఏం ప్రయోజ‌నం అనే ప్రశ్నకు స‌మాధానం చెప్పేవారు క‌నిపించ‌డం లేదు. పోనీ.. పార్టీ‌లో ఇప్పటికే ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. కొత్తగా వ‌చ్చిన వారు దూకుడు త‌గ్గించాల‌నే సంకేతాల‌ను కూడా పార్టీ అధిష్టానం ఇవ్వలేక పోతోంది. దీంతో ఎక్కడిక‌క్కడ వివాదాలు.. విభేదాల‌తో పార్టీ నేత‌లు తీరిక లేకుండా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News