జంపింగులంతా ఏమ‌య్యారు… కీల‌క స‌మ‌యంలో సైలెంట్ ?

వైసీపీ నుంచి వ‌చ్చి.. టీడీపీలో చేరిన జంపింగ్ నేతలు.. చంద్రబాబు అధికారంలో ఉన్నస‌మ‌యంలో పార్టీలో ప‌ద‌వులు అనుభవించారు. ఆర్థికంగా కూడా ల‌బ్ధి పొందార‌నే టాక్ కూడా ఉంది. [more]

Update: 2021-04-10 14:30 GMT

వైసీపీ నుంచి వ‌చ్చి.. టీడీపీలో చేరిన జంపింగ్ నేతలు.. చంద్రబాబు అధికారంలో ఉన్నస‌మ‌యంలో పార్టీలో ప‌ద‌వులు అనుభవించారు. ఆర్థికంగా కూడా ల‌బ్ధి పొందార‌నే టాక్ కూడా ఉంది. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన నాయ‌కులు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సుజ‌య్ కృష్ణరంగారావు.. చిత్తూరు జిల్లాకు చెందిన ప‌ల‌మ‌నేరు మాజీ ఎమ్మెల్యే అమ‌ర్‌నాథ్‌రెడ్డి వంటి వారు.. మంత్రి ప‌ద‌వులు కైవ‌సం చేసుకున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. సుజ‌య్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే.. అమ‌ర్ నాథ్ రెడ్డి మాత్రం అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడల్లా.. మీడియా ముందుకు వ‌స్తున్నారు. ఇటీవ‌ల తిరుప‌తి విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు అడ్డగించిన‌ప్పుడు కూడా అమ‌ర్‌నాథ్ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. కానీ..ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న చేతులు ఎత్తేసిన ప‌రిస్థితి క‌నిపించింది. ఎక్కడా ఆయ‌న ప్రభావం చూపించ‌ లేక‌పోయారు.

సొంత నియోజకవర్గాల్లోనూ….

చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో ద‌శాబ్దాల పాటు కుటుంబ చ‌రిత్ర ఉన్న అమ‌ర్‌నాథ్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ కేంద్రమైన ప‌ల‌మ‌నేరులో ఒక్కటంటే ఒక్క కౌన్సెల‌ర్ సీటు కూడా గెలిపించుకోలేక‌పోయారు. కొన్ని వార్డులు అయితే వైసీపీకి ఏక‌గ్రీవం కూడా అయ్యాయి. ఈయ‌న ఒక్కరే కాదు.. చాలా మంది నాయ‌కులు ఎక్కడా త‌మ భ‌క్తిని చాటుకోలేక పోయారు. ఆళ్లగ‌డ్డలో మంత్రి అఖిల తూతు మంత్రంగా క‌ష్టప‌డినా స‌రిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌లేదు. పార్టీ మారిన నేత‌ల్లో విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో మైనార్టీ నాయుడు జ‌లీల్ ఖాన్ మాత్రం ఒకింత ఫ‌ర్వాలేద‌ని అనిపించారు. ఎన్నిక‌ల వేళ మైనారిటీ వ‌ర్గాన్ని టీడీపీకి చేరువ చేసే ప్రయ‌త్నం చేశారు. పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే.. ఆయ‌న ప్రయ‌త్నం ఫ‌లించ‌లేదు.

ఎటువంటి ప్రయత్నాలు…..

ఈ పార్టీ మారిన జంపింగ్‌ల్లో మిగిలిన వారు జ‌లీల్ ఖాన్ మాదిరిగా కూడా ప్రయ‌త్నాలు చేయ‌లేద‌ని తెలుస్తోంది. అన్ని న‌గ‌ర పాల‌క సంస్థలు, కార్పొరేష‌న్లలో స్థానికంగా ఉన్న టీడీపీ నేత‌ల‌తో జంపింగ్ నేత‌లు చేతులు క‌ల‌ప లేకపోయారు. కొన్ని చోట్ల అయితే ఈ జంపింగ్ నేత‌లు త‌మ‌ను పిల‌వ‌లేద‌ని.. త‌మ‌కు ప్రత్యేక ఆహ్వానాలు అంద‌లేద‌ని భీష్మించారు. ఫ‌లితంగా .. పార్టీ తీవ్రస్థాయిలో దెబ్బతింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గెలుస్తామ‌నే ధీమా ఉన్న కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల్లో కూడా పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంలో జంపింగుల పాత్ర కూడా ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. పార్టీ అధికారంలో ఉండ‌గా.. ప‌ద‌వుల వేట‌లో పార్టీలోకి వ‌చ్చిన వారు.. ఇప్పుడు అదే పార్టీ పుట్టి మునుగుతున్నా.. ప‌ట్టించుకోక‌పోవ‌డంపై విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News