ప్రభుత్వాలకు తలనొప్పిగా మారాయే..? అర్థం చేసుకోవడం లేదే?

విడిస్తే పాముకు కోపం … కరిస్తే కప్పకు కోపం అన్న చందంగా మారింది ప్రభుత్వాల పరిస్థితి. ఏ సర్కార్ అధికారంలో ఉన్నా కులమతాల సెంటిమెంట్ లకు అత్యధిక [more]

Update: 2020-07-16 17:30 GMT

విడిస్తే పాముకు కోపం … కరిస్తే కప్పకు కోపం అన్న చందంగా మారింది ప్రభుత్వాల పరిస్థితి. ఏ సర్కార్ అధికారంలో ఉన్నా కులమతాల సెంటిమెంట్ లకు అత్యధిక శాతం ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. ఎందుకంటే మనోభావాల ముసుగు కి చిల్లు పడితే ఓటు బ్యాంక్ లు గల్లంతు అవుతాయి. దాంతో ప్రభుత్వాలే అధికారం కోల్పోతాయి. ఫలానా ప్రభుత్వం ఫలానా మతానికి మాత్రమే అనుకూలం వ్యతిరేకం అనే భావనలు అసలుకే ఎసరు పెడతాయని ప్రభుత్వ పెద్దలకు తెలుసు. అందుకే కర్ర విరగకుండా పాము చావకుండా సున్నితమైన అంశాల్లో ఆచితూచి అడుగులు వేయడం అనాదిగా వస్తున్నదే. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే భారత్ లో వేలకులాలు అనేక మతాల నడుమ సఖ్యత చాటిచెబుతూ సర్కార్ లు నడుచుకోవాలిసి ఉంది. ఇందులో ఏ మాత్రం గాడి తప్పినా సమాజంలో అశాంతి రేగేలా ఆయా వర్గాలు రెచ్చి పోయే ప్రమాదం ఉంది.

అనుమతుల కోసం …

ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభిస్తున్నా వివిధ మతాల ఛాందస వాదులు తమ పండగలు పబ్బాల కోసం నిబంధనలు గాలికి వదిలి వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు చూసి చూడనట్లే పోతున్నాయి. ఎవరిని అంటే ఎవరికి కోపం వస్తుందో అనే భయంతో పండగలకు సంబంధించి జరిగే కార్యక్రమాలను పెద్దగా అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో బోనాల పండగ, వినాయకచవితి ఉత్సవాలకు ఇప్పటినుంచి గట్టి సన్నాహాలు ఆయా కమిటీలు చేస్తున్నాయి. నిబంధనలు పాటిస్తూ ఊరేగింపులు, కార్యక్రమాలు చేస్తామని మరీ ప్రకటించేస్తున్నాయి. కొందరు ప్రభుత్వం అనుమతులను పెండింగ్ లో పెట్టడంతో కోర్టు కి వెళ్లి మరీ కార్యక్రమం జరపాలిసింది అంటున్నారు.

జగన్నాధుని రథయాత్రకు…

పూరి లో జగన్నాధ రథయాత్ర పై సైతం ఇలాగే అక్కడి వారు సుప్రీం కోర్ట్ కి వెళ్ళి అనుమతి తెచ్చుకుంటే ఒడిస్సా సర్కార్ మూడు రోజులు పూరి బంద్ చేయాలిసి వచ్చింది. ఇక హజ్ యాత్రలు సైతం నిలిచిపోయాయి. ఈస్టర్, రంజాన్ వంటి పండగలను ప్రజలు ఇళ్లలోనే జరుపుకున్నారు. అలాంటిది రాబోయే వినాయకచవితి ఉత్సవాల కోసం భాగ్యనగర వినాయక ఉత్సవ కమిటీ సైతం అన్ని ఏర్పాట్లు చేసుకుపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో అనేక దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమాలు ఎలా ఆపుతామని తమ సంప్రదాయం పాటించి తీరుతామని హెచ్చరిస్తుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంట్లో ఉండాలని ఒక పక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రభుత్వాల వరకు హెచ్చరికలు వస్తుంటే మరో పక్క వివిధ మతాలకు చెందిన పెద్దలు కొంత కాలం సంయమనం పాటించేందుకు ఓపిక పట్టలేకపోతున్నారు . ఇది అందరిని ఆందోళన కలిగిస్తుంది.

Tags:    

Similar News