Congress : సొంత టీమ్ ను సెట్ చేస్తున్నారా?

కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం చేతుల్లోనుంచి బయటపడదు. ఒకవేళ బలవంతంగా అప్పగించినా పార్టీ మనుగడ ఎక్కువ కాలం సాధ్యం కాదు. అయితే గత కొంతకాలంగా సీనియర్లు కాంగ్రెస్ [more]

Update: 2021-10-07 16:30 GMT

కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం చేతుల్లోనుంచి బయటపడదు. ఒకవేళ బలవంతంగా అప్పగించినా పార్టీ మనుగడ ఎక్కువ కాలం సాధ్యం కాదు. అయితే గత కొంతకాలంగా సీనియర్లు కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారారు. జనంలో పెద్దగా పలుకుబడి లేని నేతలు పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినాయకత్వాన్ని థిక్కరించిన సంగతి తెలిసిందే. వీరిని స్లోగా వదిలించుకోవాలనే కాంగ్రెస్ పార్టీ సిద్ధమయినట్లు కన్పిస్తుంది.

వారిని పూర్తిగా ఇగ్నోర్ చేసి…

జీ 23 గా పేరు పడిన సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ పై ఇప్పట్లో కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టే అవకాశాలు కన్పించడం లేదు. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాతనే శాశ్వత అధ్యక్షుడిని నియమించాలన్న ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. ఈలోపు తమ టీంను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రెడీ చేస్తున్నారు.

పొగ పెట్టకుండానే…

సీనియర్ నేతలకు పొగ పెట్టకుండానే పొమ్మనే కార్యక్రమం కాంగ్రెస్ లో ప్రారంభమయింది. ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్ ఎన్నికలకు సంబంధించి సీినియర్ నేతలను పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ కు ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ ను సమన్వయ కర్తగా పార్టీ నాయకత్వం నియమించింది. రాజస్థాన్ లో అజయ్ మాకెన్ ను నియమించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సన్నిహితులైన వారిని రాష్ట్రాలకు పంపుతున్నారు.

ప్రచారానికి కూడా….

అనుభవాన్ని పక్కన పెడితే సీినియర్ల వల్ల ఉపయోగం ఏమీ లేదని తేలిపోయింది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలోనూ వారి సేవలను ఉపయోగించుకోకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వారిని కనీసం ప్రచారానికి కూడా పంపరు. అక్కడి స్థానిక నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలను కొందరినే ఎంపిక చేసి రాష్ట్రాలకు పంపనున్నారు. వీళ్లంతా రాహుల్, ప్రియాంక గాంధీ టీమ్ సభ్యులే ఉంటారు. మొత్తం మీద రాహుల్, ప్రియాంకలు తమ సొంత టీమ్ ను సెట్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News