మూడు ముళ్లు.. పడేదెలా? చిక్కొచ్చి పడిందే?

ఉగాది తరువాత ఎపి లో ఈ ఏప్రిల్ నెలలో పెద్దఎత్తున పెళ్ళి బాజాలు మోగాల్సివుంది. అయితే కరోనా వైరస్ దెబ్బతో ఒక్కసారిగా ముహుర్తాలు పెట్టుకున్నవారంతా ఆందోళనలో పడ్డారు. [more]

Update: 2020-03-21 09:30 GMT

ఉగాది తరువాత ఎపి లో ఈ ఏప్రిల్ నెలలో పెద్దఎత్తున పెళ్ళి బాజాలు మోగాల్సివుంది. అయితే కరోనా వైరస్ దెబ్బతో ఒక్కసారిగా ముహుర్తాలు పెట్టుకున్నవారంతా ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే వివాహానికి సంబంధించి అడ్వాన్స్ లు ఇచ్చేసి క్యాన్సిల్ చేసుకోవాలో కార్యక్రమం సింపుల్ గా ముగించాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. తమ కుమార్తె, కుమారుడి వివాహాలు జీవితంలో మరుపురానివిధంగా చేయాలని ప్రతి తల్లితండ్రులు భావిస్తారు. అలాగే వధూవరులు వేలు, వందల సంఖ్యలో అతిధులు వచ్చి తమను ఆశీర్వదించాలని కలలు కంటారు. అందుకు అనుగుణంగానే ముహూర్తానికి మూడు నెలల ముందే భారీ పెళ్ళిళ్ళ హడావిడి మొదలైపోతుంది. పేద, మధ్యతరగతి వర్గాల్లో కూడా ముందుగానే అన్ని సమకూర్చుకోవడానికి నెలలతరబడి కార్యాచరణ ప్రారంభిస్తారు. అయితే కరోనా రక్కసి ఇప్పుడు నవదంపతులు కావాలనుకునే వారిపై పగబట్టింది.

ప్రభుత్వం హెచ్చరికలతో …

ఇప్పటికే ప్రభుత్వం ఫంక్షన్ హాళ్లను అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడికి కఠిన చర్యలే చేపడుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు 24 గంటలు పర్యవేక్షణలు మొదలు అయ్యాయి. పోనీ ఏ గుడిలోనో, బడిలోనో వివాహ కార్యక్రమం జరుపుకుందామనుకున్నా అవి పూర్తిగా బంద్ అయిపోయాయి. దగ్గరి బంధువులు కూడా పెళ్ళిళ్ళకు హాజరు కావడం అనుమానం అనే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మార్చి నెలాఖరు వరకు ఆంక్షలు అంటున్న కరోనా పై మరో ఏడాదికి పైగా పోరాటం చేయాలిసిన పరిస్థితి కనిపిస్తుందని నిపుణులే చెబుతున్నారు. దాంతో సంబంధాలు కుదుర్చుకుని తాంబూలాలు తీసుకుని నెలల తరబడి తమ వారికి పెళ్ళిళ్ళు చేయకుండా ఉండటం అనేక కష్టనష్టాలకు తెరతీస్తుందని అంతా ఆందోళన చెందుతున్నారు.

ఇచ్చిన అడ్వాన్స్ లు రానట్టే …

వివాహ ముహూర్తం కుదిరి కుదరగానే ఫంక్షన్ హాల్స్ నుంచి ఫోటో గ్రాఫర్ వరకు అన్ని తక్షణం బుక్ చేసుకోకపోతే ఆ సమయానికి ఏ ఒక్కరు దొరకరు. దాంతో భారీ ఎత్తున అడ్వాన్స్ లను ఇప్పటికే ముహుర్తాలు పెట్టుకున్నవారు ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ లను తీసుకున్నవారు వెనక్కి ఇవ్వరు. అలా అని సింపుల్ గా పెళ్ళి చేసుకుంటే ఆ సొమ్మంతా కరోనా వైరస్ కి అర్పించినట్లే అవుతుంది. లక్షల రూపాయలు సొమ్ము ఖర్చు పెట్టుకుని సాదాసీదాగా చేసుకోవడం వల్ల ఇరువైపుల వారు భారీగానే నష్టపోతారు. వీరితో బాటు వచ్చే ముహూర్తాల్లో నాలుగు రూపాయలు సంపాదించొచ్చని వివాహాలకు ఎదురు చూస్తున్న వారంతా ఇప్పుడు ఈ సీజన్ కరోనా దెబ్బతో లేనట్లే అని లబోదిబో అంటున్నారు. వీరంతా ఇప్పుడు ఏ అడుగులు వేయాలన్న ఈ నెల చివరి వరకు వేచి చూడక తప్పదు.

Tags:    

Similar News