ఆ మీడియాకు ఇక కాలం చెల్లినట్లే?

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయిన సంగతి తెలిసిందే. అయితే తొలిగా దీని ప్రభావాన్ని ఎదుర్కొన్నది మాత్రం పత్రికలు కావడం దురదృష్టకరం. తెల్లవారుతుండగానే [more]

Update: 2020-04-06 11:00 GMT

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయిన సంగతి తెలిసిందే. అయితే తొలిగా దీని ప్రభావాన్ని ఎదుర్కొన్నది మాత్రం పత్రికలు కావడం దురదృష్టకరం. తెల్లవారుతుండగానే ఇంటి గుమ్మం ముందు ప్రత్యక్షం అయ్యే పత్రికలను చూస్తేనే ఇప్పుడు ప్రజలు హడలి పోతున్నారు. చాలా కాలనీలు, అపార్ట్ ెమెంట్లలో వీటిని నిషేధించేశారు పాఠకులు. కరోనా వైరస్ పేపర్ పై ఉండే అవకాశాలు ఉన్నాయంటూ ఆ మధ్య ఒక ఇటాలియన్ వీడియో సామాజిక వేదికలపై హల్ చల్ చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో జనం ఇప్పుడు పేపర్ చూస్తేనే హడలిపోతున్నారు.

కరెన్సీ నోట్లను కూడా…

దీనికి తోడు కొందరు బ్యాంకర్లు కరెన్సీ నోట్లను ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేస్తున్న వీడియో లు సోషల్ మీడియా లో బాగా వ్యాప్తి చెందుతున్నాయి. దాంతో పత్రికల యాజమాన్యాలు వైరస్ కి దీనికి సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా జనం వినిపరిస్థితి లేకుండా పోయింది. నిత్యావసరాల జాబితాలో చేర్చబడిన పత్రికలను నిలుపుదల చేయడం అడ్డగించడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ ప్రజల భయం ముందు ఇవన్నీ వెనక్కి పోయాయి. ఈ నేపథ్యంలో డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి వంటి పత్రికలు లాక్ డౌన్ లో షట్ డౌన్ అంటూ నిర్ణయం తీసుకున్నాయి.

కొన్ని లాక్ డౌన్ మరికొన్ని ….

మీడియా రంగంలో ఛానెల్స్ నిర్వహించడం కన్నా పత్రికలను నడపడటమే అత్యంత కష్టసాధ్యం అయిన పని. దినదినగండం గా మారిన నేటి రోజుల్లో పత్రికా నిర్వహణ కత్తిమీద సాముగానే ఉంది. పార్టీ పత్రికలుగా చాలా వరకు నడుస్తున్నా పాఠకులే తిప్పికొడుతుంటే న్యూస్ పేపర్స్ కి ఆక్సిజన్ వంటి ప్రకటనలు ఆగిపోతే వ్యవస్థ ప్రమాదంలో పడిపోయింది. దాంతో జిల్లాలవారి వార్తలకు కేటాయించిన టాబ్లాయిడ్ ల ప్రింటింగ్ నిలుపు చేశాయి ప్రధాన పత్రికలు. అలాగే మెయిన్ ఎడిషన్ లో పేజీలను కుదించాయి. కరోనా సంక్షోభం ముగిసిన వెంటనే అవసరం లేని సిబ్బందిని తొలగించే ప్రక్రియకు సిద్ధం అవుతున్నాయి. పోటీ రంగం లో ఉన్నా పార్టీల పత్రికలుగా కొన్ని ఉన్నా యాజమాన్యాలు అన్ని కాస్ట్ కటింగ్ లో ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలని చర్చించినట్లు సోషల్ మీడియా ల్లో విస్తృతంగా కధనాలు మొదలు అయ్యాయి.

దారుణమైన కోత తప్పదా …

ఎప్పుడైతే పత్రికల్లో జిల్లా టాబ్లాయిడ్ లు రద్దు అయ్యాయో డెస్క్ ల్లో పనిచేసే సబ్ ఎడిటర్లకు పని లేదు. అదేవిధంగా మండలాలు, నగరాల నుంచి వార్తలు సేకరించి అందించే కంట్రిబ్యూటర్ల వ్యవస్థకు చెక్ పడినట్లే. దాంతో వైరస్ కట్టడి తరువాత కూడా పత్రికలపై మరో ఏడాది పాటు జనం అనుమానించే పరిస్థితి కొనసాగనున్నందున జిల్లా టాబ్లాయిడ్ లను పత్రికా యాజమాన్యాలు ముద్రించే సాహసం చేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దాంతో సబ్ ఎడిటర్లు, ఎన్ని లైన్లు రాస్తే అంత సొమ్ము తెచ్చుకునే కంట్రిబ్యూటర్ ల వ్యవస్థకి బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే వేలాదిమంది జర్నలిస్టులు రోడ్డున పడనున్నారు. పూర్తిగా అసంఘటిత రంగంలో ఉన్న వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత ఎప్పటినుంచో లేనందున ప్రత్యామ్నాయ ఉపాధికి వీరు వెతుకొక్క తప్పదు. ఈలోగా నిరుద్యోగులుగా మారే అవకాశాలే ఆ రంగంలోని వారికి తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలా ఉపాధి కోల్పోయిన వారు వేరే వృత్తుల్లోకి ఉన్నట్టుండి మారడం కూడా అంత సాధ్యం అయ్యేది కూడా కాదు.

వెబ్ మీడియా లోకి …

ఇప్పటికే చాలా పత్రికలు వెబ్ జర్నలిజం వైపు పెట్టుబడులను భారీగానే మళ్లించాయి. సాక్షి, ఈనాడు వంటివి వెబ్ ప్రపంచమే భవిష్యత్తు అని గుర్తించి ఆ దిశగానే పత్రికలను ఆధునీకరించేశాయి. అయితే కమ్యూనిస్ట్ ల పత్రికలైన విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటివి, వార్త ఇతర రాష్ట్ర స్థాయి స్థానిక పత్రికలు తమ తీరును ఇంకా పూర్తిగా మార్చుకోలేకపోతున్నాయి. ప్రస్తుత వైరస్ కారణమే కాకుండా కొన్నేళ్లుగా ఆధునిక సాంకేతిక పరిణామాలు పత్రికా రంగం తీరునే మార్చేస్తూ వస్తున్నాయి. కాలం తో పాటు మార్పు చెందని వ్యవస్థలు మాత్రం కొట్టుకుపోయే ప్రమాదం ఎప్పటినుంచో పొంచి ఉంది. సమాజ హితం పక్కన పెట్టి లాభాపేక్షతోనే స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో పత్రికా వ్యవస్థ నడుస్తూ వస్తుంది. ఆర్ధిక పరిపుష్టి ఉంటే నడపడం లేదా తమ వ్యాపార, రాజకీయ అవసరాలకోసం పత్రికలను నడిపే యాజమాన్యాలే అత్యధికం. అందువల్ల తాజాగా వచ్చిన రాబోయే సంక్షోభాలను భరించి, సహించి ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు యాజమాన్యాలు అయితే ఏ మాత్రం సిద్ధంగా లేవు. సో ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ల మెడపై కత్తి వేలాడుతుందని గ్రహించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News